
జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో భారత ఒలింపిక్ స్టార్లంతా ఆడుతుండటంతో టోర్నీకి కొత్త కళ వచ్చింది. కానీ వేదికలో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో ఆ కళ కాస్తా కలవరపాటుకు గురిచేసింది. కోర్టులు నాసిరకంగా ఉండటంతో వెటరన్ స్టార్ సైనా నెహ్వాల్ సహా మరో ఇద్దరి హైదరాబాదీల మ్యాచ్‌లను రీ షెడ్యూలు చేయాల్సి వచ్చింది. ఆడాల్సిన కోర్టులు సమతలంగా లేకపోవడంతో సైనా, ఆమె భర్త పారుపల్లి కశ్యప్, భమిడిపాటి సాయిప్రణీత్ మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. కోర్టు ఉపరితలం (సర్ఫేస్)లో అక్కడక్కడ గుంతలు, కొన్ని చోట్ల చెక్కలు తేలినట్లు ఉండటంతో సైనా ఆడనని నిరసన వ్యక్తం చేసింది. త్వరలోనే ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ జరుగనున్న నేపథ్యంలో నాసిరకమైన ఎగుడుదిగుడుగా ఉన్న కోర్టుపై రిస్క్ తీసుకునేందుకు ఆమె నిరాకరించింది.
ఆమె దారిలోనే కశ్యప్, సాయిప్రణీత్ నడవడంతో ఈ ముగ్గురు ఆడాల్సిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్ని రీషెడ్యూలు చేయక తప్పలేదు. ‘సింధు మ్యాచ్ ముగిశాక సర్ఫేస్ దెబ్బతినడంతో ఆట కుదరదని చెప్పేశాం. నిర్వాహకులు సమస్యని చక్కదిద్దేందుకు సిద్ధమయ్యారు. దీంతో మా ముగ్గురి మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి’ అని కశ్యప్ తెలిపాడు. భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఈవెంట్స్ కార్యదర్శి ఒమర్ రషీద్ వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టారు. టోర్నీకి మరో వేదికైన టీఆర్పీ ఇండోర్ స్టేడియంలో ఈ మ్యాచ్‌లను ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment