కోచ్‌ కిమ్‌ హ్యూన్‌ నిష్క్రమణ! | PV Sindhu Korean Coach Resigns For Personal Reasons | Sakshi
Sakshi News home page

కోచ్‌ కిమ్‌ హ్యూన్‌ నిష్క్రమణ!

Published Wed, Sep 25 2019 3:47 AM | Last Updated on Wed, Sep 25 2019 3:47 AM

PV Sindhu Korean Coach Resigns For Personal Reasons  - Sakshi

న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన భారత బ్యాడ్మింటన్‌ కోచ్‌ కిమ్‌ జి హ్యూన్‌ అంటే గతంలో ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ  సింధు ప్రపంచ చాంపియన్‌గా మారడంలో కిమ్‌ చేసిన కృషి ఏమిటో బ్యాడ్మింటన్‌ వర్గాలకు బాగా తెలుసు. ఇప్పుడు ఆమె అనూహ్యంగా తప్పుకుంది. సింధు విజేతగా నిలిచిన కొద్ది రోజులకే కొరియాకు చెందిన  మహిళా కోచ్‌ కిమ్‌ మంగళవారం అనూహ్యంగా రాజీనామా చేసింది. వ్యక్తిగత కారణాలతోనే వైదొలగుతున్నట్లు ఆమె వెల్లడించింది. ఈ నిర్ణయం బ్యాడ్మింటన్‌ వర్గాల్ని విస్మయానికి గురిచేసింది. 45 ఏళ్ల కిమ్‌ ఇప్పటికే న్యూజిలాండ్‌కు చేరుకుంది. తన భర్త రిట్‌చీ మార్‌ అనారోగ్యానికి గురవడంతో ఆఘమేఘాల మీద అక్కడికి వెళ్లింది. కొన్ని రోజుల కిందట రిట్‌చీ మార్‌ నరాల సంబంధిత వ్యాధికి గురయ్యాడు.ఈ నేపథ్యంలోనే ఆమె ఉన్నపళంగా ని్రష్కమించిందని తెలిసింది. కిమ్‌ను ఈ ఏడాది ఆరంభంలోనే భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) ప్రత్యేకంగా సింగిల్స్‌ కోచ్‌గా నియమించింది.

‘బాయ్‌’ నియామకం బాగా పనిచేసింది. సింగిల్స్‌లో ఆడే షట్లర్ల కోసమే ఆమెను నియమించడం సింధులాంటి క్రీడాకారిణికి బాగా కలిసొచ్చింది. తెలుగు తేజాన్ని గత నెల ప్రపంచ చాంపియన్‌గా చేసేందుకు కిమ్‌ జి హ్యూన్‌ ఎంతో ప్రణాళికతో కష్టపడింది. ఆమె కోచింగ్‌ కూడా చాలా ప్రత్యేకమైందంటారు క్రీడాకారిణులు. అందుకే సింధు విజయంలో ఆమె కీలకపాత్ర పోషించింది. అలాంటి కోచ్‌ అంతలోనే వైదొలగడం సింధుతో పాటు షట్లర్లను నిరాశపరుస్తోంది. జాతీయ చీఫ్‌ కోచ్‌ గోపీచంద్‌ మాట్లాడుతూ ‘నిజమే. కిమ్‌ రాజీనామా చేశారు. తన భర్త అనారోగ్య కారణాలతోనే ఆమె వైదొలగినట్లు తెలిసింది. ప్రపంచ చాంపియన్‌íÙప్‌ సమయంలో ఆమె భర్త ‘న్యూరో స్ట్రోక్‌’కు గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఆయన్ను దగ్గరుండి చూసుకునేందుకే ఆమె బయల్దేరింది. ఆమె భర్త తిరిగి కోలుకునేందుకు 4 నుంచి 6 నెలల సమయం పడుతుందని తెలిసింది’ అని అన్నారు. ‘బాయ్‌’ కార్యదర్శి అజయ్‌ సింఘానియా స్పందిస్తూ తమకు గానీ, భారత స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌)కి గానీ కోచ్‌ నుంచి రాజీనామా లేఖ అందలేదని చెప్పారు.

‘కోచ్‌ భర్తకు బాగా లేదని తెలుసు కానీ... ఆమె నుంచి అధికారికంగా రాజీనామా లేఖ మాకు అందలేదు. సాయ్‌కి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు’ అని ఆయన తెలిపారు. ఆమె రాజీనామాపై సింధు విచారం వ్యక్తం చేసింది. ‘ఇది చాలా దురదృష్టకరం. ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యే తరుణంలో కిమ్‌ వెళ్లిపోవడం పెద్ద లోటు. ఆమె భర్త త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా. ఆమె కోచింగ్‌ నన్ను బాగా మార్చింది. మా ఇద్దరికి మంచి సమన్వయం కుదిరింది. ఏదేమైనా క్రీడాకారుల జీవితంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవాల్సిందే. గోపీసర్, బాయ్‌ పరిస్థితుల్ని చక్కదిద్దుతారని ఆశిస్తున్నాను’ అని సింధు తెలిపింది. ఒలింపిక్స్‌కు మరో పది నెలల సమయమే ఉండటంతో బాయ్‌ ఇప్పుడు కిమ్‌ స్థానాన్ని సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయాల్సివుంటుంది. దీనికి త్వరలోనే శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని కోచ్‌ గోపీచంద్‌ అన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement