ట్రంప్ ఫస్ట్... సింధు సెకండ్!
హైదరాబాద్:ఈ ఏడాది గూగుల్ సెర్చ్ ఇంజన్లో అత్యధికంగా వెతికిన వారిలో భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి, హైదరాబాద్ అమ్మాయి పివి సింధుకు స్థానం లభించింది. రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన సింధు టాప్-10 ట్రెండింగ్ ప్రముఖుల్లో రెండో స్థానంలో నిలిచింది. భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ నాల్గో స్థానంలో నిలవడం విశేషం. ఇలా భారత్ నుంచి గూగూల్ టాప్-10 సెర్చ్ జాబితాలో నిలిచిన వారిలో సాక్షి మాలిక్, బ్యాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్లున్నారు. అయితే ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ కు తొలిస్థానం దక్కింది.
ఇదిలా ఉండగా, క్రీడాకారుల జాబితాలో ఏ ఒక్క భారత్ క్రికెటర్ టాప్-10లో స్థానం దక్కించుకోలేదు. గత కొన్ని నెలల క్రితం ఒలింపిక్స్ జరిగిన నేపథ్యంలో బ్యాడ్మింటన్, తదితర భారత క్రీడాకారులను మాత్రమే అత్యధికంగా గూగూల్ సెర్చ్లో వెతికారు. ఇదిలా ఉండగా, ఎంఎస్ ధోని బయోపిక్లో నటించిన దిషా పటానీ కూడా గూగూల్ సెర్చ్ టాప్-జాబితాలో చోటు దక్కించుకుంది.
మరొకవైపు దక్షిణాది సినిమా టాప్ ట్రెండింగ్ జాబితాలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలీ, జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో, జనతా గ్యారెజ్లను అత్యధికంగా వెతికారు. దాంతోపాటు పవన్ కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్, అల్లు అర్జున్ నటించిన సరైనోడు, అక్కినేని నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయనా సినిమాలకు కూడా చోటు దక్కింది.