'ఫైనల్‌' చాన్స్‌ | Qualifier 2: Kolkata v Hyderabad | Sakshi
Sakshi News home page

'ఫైనల్‌' చాన్స్‌

Published Fri, May 25 2018 1:37 AM | Last Updated on Fri, May 25 2018 12:55 PM

Qualifier 2: Kolkata v Hyderabad - Sakshi

పదునైన బౌలింగ్‌ దళం, సారథి అసాధారణ బ్యాటింగ్‌తో లీగ్‌ మ్యాచ్‌ల గెలుపు గుర్రంగా నిలిచింది సన్‌రైజర్స్‌. పడుతూ... లేస్తూ, డక్కామొక్కీలతో ఎట్టకేలకు ఎలిమినేటర్‌ దశకు చేరింది నైట్‌రైడర్స్‌. తొలి క్వాలిఫయర్‌లో ఆసాంతం ఆధిపత్యం చలాయించి ఆఖర్లో చెన్నైకు మ్యాచ్‌ సమర్పించుకుంది హైదరాబాద్‌! ఎలిమినేటర్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ చేతిలో తడబడినా... తేరుకుని విజయఢంకా మోగించింది కోల్‌కతా! ... బలాబలాల్లో విలియమ్సన్‌ సేన వైపే కొంత మొగ్గు ఉన్నా, సొంతగడ్డపై ఆడుతున్న దినేశ్‌ కార్తీక్‌ బృందాన్ని తక్కువ అంచనా వేయలేం.   

కోల్‌కతా: చివరి అంకానికి చేరిన ఐపీఎల్‌–11లో... రెండో ఫైనల్‌ బెర్త్‌ ఎవరిదో తేల్చుకునేందుకు నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పోటీ పడనున్నాయి. ఈ క్వాలిఫయర్‌– 2లో విజేత... ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఫైనల్‌ ఆడుతుంది. ప్రస్తుత లీగ్‌లో గెలుపు గణాంకాలను లెక్కలోకి తీసుకుంటే వరుస విజయాలతో ప్లే ఆఫ్స్‌ చేరిన హైదరాబాద్‌కు కోల్‌కతా సమీపానికి రాలేదు. కానీ, క్లిష్ట పరిస్థితుల్లోనూ పుంజుకుని ఆడుతున్న ఆ జట్టు ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చింది. వారి పోరాటానికి తగినట్లే పరిణామాలు కలిసొచ్చి ఎలిమినేటర్, క్వాలిఫయర్‌–2 మ్యాచ్‌లు ఈడెన్‌ గార్డెన్స్‌కు మారాయి. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌లో ఆసక్తికర సమరానికి అవకాశం ఉంది. 

విజయాల రివర్స్‌ గేర్‌లో సన్‌రైజర్స్‌... 
చివరి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు పరాజయాలు. ఇదీ హైదరాబాద్‌ ప్రస్తుత పరిస్థితి. ఓ దశలో పటిష్టంగా కనిపించిన జట్టు క్రమంగా వెనుకబడింది. అయితే, అంతకుముందు సాధించిన విజయాల కారణంగా ఓటములు జట్టు ప్రయాణాన్ని పెద్దగా ప్రభావితం చేయలేదు. ఆ తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటేనే ఫైనల్‌ చేరేందుకు అర్హత సాధిస్తుంది. పిచ్‌ ఎలా ఉన్నా... క్వాలిఫయర్‌–1లో బ్యాటింగ్‌ అతి సాధారణంగా సాగింది. విలియమ్సన్‌పై ఎంతగా ఆధారపడుతోందో ఈ మ్యాచ్‌తో మరోసారి తెలిసింది. బ్రాత్‌వైట్‌ ఇన్నింగ్సే లేకుంటే స్కోరు వంద కూడా దాటని పరిస్థితి. దీన్నిబట్టి చూస్తే కెప్టెన్‌తో పాటు ఓపెనర్‌ ధావన్‌ చెలరేగాల్సిన అవసరం ఉంది. మిగిలిన బాధ్యతను మనీశ్‌ పాండే, యూసుఫ్‌ పఠాన్‌ తీసుకుంటే భారీ స్కోరు నమోదవుతుంది. ఫామ్‌ కోల్పోయినా... మెరుగైన ప్రత్యామ్నాయం లేక కొనసాగుతున్న వీరిద్దరూ ఏ మేరకు రాణిస్తారో చూడాలి. మరోవైపు మొదటి నుంచి అండగా ఉన్న బౌలింగ్‌ బలగం మరింత కట్టుదిట్టం అయితే ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేసి పైచేయి సాధించవచ్చు. గత మ్యాచ్‌లో చెన్నైపై భువీ, కౌల్, రషీద్‌ సహా బౌలర్లంతా రాణించినా కొన్ని బంతులు ఎడ్జ్‌ తీసుకుని బౌండరీలకు వెళ్లడం, చివరి ఓవర్లు ఎవరితో వేయించాలనే విషయంలో విలియమ్సన్‌లెక్క తప్పడం ఫలితాన్ని మార్చింది. అందుకని వ్యూహాలనూ సమీక్షించుకుని బరిలో దిగాలి.
 
సూపర్‌ ఫామ్‌... సొంతగడ్డ
... 
గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట్లో గెలుపు. అందు లోనూ ప్లే ఆఫ్స్, క్వాలిఫయర్‌–2కు చేర్చిన విజయాలు. ఇప్పుడు ఆడబోయేది సొంత మైదానంలో. బ్యాటింగ్‌లో తలా ఓ చేయి వేయగల ఆటగాళ్లున్నారు. బౌలింగూ బాగానే ఉంది. రసెల్‌ హిట్టింగ్‌ నైపుణ్యం తోడుగా కెప్టెన్‌ కార్తీక్‌ అద్భుత ఫినిషింగ్‌లతో అదరగొడుతున్నాడు. ఇంతటి ఊపులో ఉన్న కోల్‌కతా... సన్‌రైజర్స్‌కు కొరుకుడు పడటం కష్టమే. ఓపెనర్‌ లిన్‌తో పాటు నితీశ్‌ రాణా, ఉతప్ప మోస్తరు స్కోర్లే చేస్తున్నా జట్టు గెలుస్తోందంటే అది కార్తీక్, రసెల్‌ ముగింపు నైపుణ్యం, నరైన్‌ మెరుపు ఇన్నింగ్స్‌ల గొప్పదనమే. గత మ్యాచ్‌లో టాపార్డర్‌ విఫలమైనా కార్తీక్, రసెల్‌ జట్టును నడిపించారు. దీంతో మ్యాచ్‌లో కోల్‌కతా కోలుకుని మెరుగైన స్కోరు చేసింది. యువ శుబ్‌మన్‌ గిల్‌ ఫర్వాలేదనిస్తున్నాడు. బౌలింగ్‌లో నరైన్, కుల్దీప్, చావ్లాల వైవిధ్య స్పిన్‌ను ఆడటం హైదరాబాద్‌ బ్యాట్స్‌మెన్‌కు కత్తి మీద సామే. పేస్‌ విభాగంలోనే కొంత ఇబ్బంది కనిపిస్తోంది. ప్రసిధ్, సియర్ల్స్‌లను ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉంది. ఈ ఒక్కటి తప్ప జట్టులో లోపాలు పెద్దగా లేవు.

తుది జట్లు (అంచనా)
హైదరాబాద్‌: విలియమ్సన్‌ (కెప్టెన్‌), ధావన్, పాండే, యూసుఫ్‌ పఠాన్, షకీబ్, శ్రీవత్స్‌ గోస్వామి, బ్రాత్‌వైట్, భువనేశ్వర్, రషీద్‌ ఖాన్, సిద్దార్థ్‌ కౌల్, సందీప్‌ శర్మ. 
కోల్‌కతా: దినేశ్‌ కార్తీక్‌ (కెప్టెన్‌), లిన్, నరైన్, ఉతప్ప, నితీశ్‌ రాణా, శుబ్‌మన్‌ గిల్, రసెల్, చావ్లా, కుల్దీప్, సియర్ల్స్, ప్రసిధ్‌.

►లీగ్‌ దశ ముఖాముఖి మ్యాచ్‌ల్లో చెరోటి గెలిచాయి. రెండూ సొంత మైదానాల్లో ఓడిపోవడం గమనార్హం. 
► సిద్దార్థ్‌ కౌల్‌ (హైదరాబాద్‌) రెండు జట్లలో అత్యధిక వికెట్లు (19) తీసిన బౌలర్‌. నైట్‌రైడర్స్‌లో సునీల్‌ నరైన్‌   16 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు. 
► మరో 10 పరుగులు చేస్తే దినేశ్‌ కార్తీక్‌ ప్రస్తుత లీగ్‌లో 500 పరుగులు చేసిన 8వ బ్యాట్స్‌మన్‌ అవుతాడు. అతడు ప్రస్తుతం 54.44 సగటుతో 490 పరుగులు చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement