
స్వీట్ 16...
►రాఫెల్ నాదల్‌దే యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్
►కెరీర్‌లో 16వ గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ కైవసం
►ఫైనల్లో అండర్సన్‌పై విజయం
►రూ. 23 కోట్ల 61 లక్షల ప్రైజ్‌మనీ సొంతం
ఎలాంటి ‘వండర్’ జరగలేదు. దక్షిణాఫ్రికా ఆజానుబాహుడు అండర్సన్ అద్భుతం చేయలేదు. అనుభవజ్ఞుడైన రాఫెల్ నాదల్ మళ్లీ రఫ్ఫాడించాడు. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో ముచ్చటగా మూడోసారి చాంపియన్‌గా నిలిచాడు. ఏకపక్షంగా జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ నాదల్ తన స్థాయికి తగ్గ ఆటతీరును కనబరిచి ఔరా అనిపించాడు. తన చిన్ననాటి ప్రత్యర్థి అండర్సన్‌ను హడలెత్తించి స్వీట్ 16 గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను హస్తగతం చేసుకున్నాడు. గత రెండేళ్లలో గాయాలతో తడబడిన నాదల్ కెరీర్‌కు తాజా ‘గ్రాండ్’ టైటిల్స్‌తో పూర్వ వైభవం వచ్చింది.
న్యూయార్క్: గత రెండేళ్లలో ఎదురైన చేదు ఫలితాలను మరచిపోయే విధంగా ఈ ఏడాది రాఫెల్ నాదల్ చెలరేగిపోయాడు. నాలుగేళ్ల తర్వాత యూఎస్ ఓపెన్‌లో మరోసారి విజేతగా నిలిచి ఈ సీజన్‌ను చిరస్మరణీయంగా మల్చుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ నాదల్ (స్పెయిన్) 6–3, 6–3, 6–4తో ప్రపంచ 32వ ర్యాంకర్, 28వ సీడ్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై వరుస సెట్‌లలో అలవోకగా గెలిచాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన నాదల్, ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ సాధించాడు. వింబుల్డన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించి, యూఎస్ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచాడు.
కెరీర్‌లో 23వసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన నాదల్‌కు తన 34వ ప్రయత్నంలో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి ప్రవేశించిన అండర్సన్ ఏదశలోనూ పోటీనివ్వలేదు. 6 అడుగుల 8 అంగుళాల ఎత్తు, 93 కేజీల బరువున్న అండర్సన్ సంధించిన పదునైన సర్వీస్‌లకు నాదల్ ఆద్యంతం అంతే చాకచక్యంగా రిటర్న్ చేసి పైచేయి చాటుకున్నాడు. 2 గంటల 28 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో నాదల్ కేవలం 11 అనవసర తప్పిదాలు చేయగా... అండర్సన్ ఏకంగా 40 అనవసర తప్పిదాలు చేయడం ఈ దక్షిణాఫ్రికా ప్లేయర్ ఎంత ఒత్తిడిలో ఆడాడో అర్థమవుతోంది. నాదల్ నెట్ వద్దకు 16సార్లు దూసుకొచ్చి 16 సార్లూ పాయింట్లు సంపాదించగా... అండర్సన్ 34సార్లు నెట్ వద్దకు వచ్చి 16 సార్లు మాత్రమే పాయింట్లు నెగ్గడంలో సఫలమయ్యాడు. స్పెయిన్ స్టార్ ఒక ఏస్ సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేయగా... అండర్సన్ 10 ఏస్‌లు కొట్టి, నాలుగు డబుల్‌ఫాల్ట్‌లు చేశాడు. మ్యాచ్ మొత్తంలో నాదల్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేయగా... అండర్సన్‌కు మాత్రం ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశం రాలేదు.
►విజేతగా నిలిచిన నాదల్‌కు 37 లక్షల డాలర్లు (రూ. 23 కోట్ల 61 లక్షలు)... రన్నరప్ అండర్సన్‌కు 18 లక్షల 25 వేల డాలర్లు (రూ. 11 కోట్ల 64 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
►3 యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచే క్రమంలో నాదల్ కేవలం మూడు సెట్‌లు మాత్రమే కోల్పోయాడు.
►5 ఓపెన్ శకంలో (1968 తర్వాత) యూఎస్ ఓపెన్ టైటిల్‌ను మూడు అంతకంటే ఎక్కువసార్లు గెలిచిన ఐదో క్రీడాకారుడు నాదల్.
సంప్రాస్, కానర్స్, ఫెడరర్ ఐదేసిసార్లు సాధించగా... మెకన్రో నాలుగుసార్లు గెలిచాడు.
►4 ఒకే ఏడాది రెండు అంతకంటే ఎక్కువ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గడం నాదల్‌కిది నాలుగోసారి.
►74 తన కెరీర్‌లో నాదల్ సాధించిన సింగిల్స్ టైటిల్స్. ఇప్పటివరకు ఈ ఏడాది అతను ఐదు టైటిల్స్ గెలిచాడు.
►నాదల్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (16)
►ఆస్ట్రేలియన్ ఓపెన్ (1): 2009
►ఫ్రెంచ్ ఓపెన్ (10): 2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017
►వింబుల్డన్ (2): 2008, 2010
►యూఎస్ ఓపెన్ (3): 2010, 2013, 2017
ఆ ఐదుగురి ఆధిపత్యం...
2003 వింబుల్డన్ నుంచి ఈ ఏడాది యూఎస్ ఓపెన్ దాకా జరిగిన 58 గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లలో 53 టైటిల్స్ ఫెడరర్, నాదల్, జొకోవిచ్, ముర్రే, వావ్రింకా ఖాతాలోకే వెళ్లడం విశేషం. ఫెడరర్ 19, నాదల్ 16, జొకోవిచ్ 12 టైటిల్స్ నెగ్గగా... ముర్రే (బ్రిటన్), వావ్రింకా (స్విట్జర్లాండ్) మూడేసి టైటిల్స్‌ను దక్కించుకున్నారు. మరో ఐదుగురు ఆటగాళ్లు రాడిక్ (అమెరికా), గాడియో (అర్జెంటీనా), సఫిన్ (రష్యా), డెల్‌పొట్రో (అర్జెంటీనా), సిలిచ్ (క్రొయేషియా) ఒక్కో గ్రాండ్ టైటిల్‌తో సరిపెట్టుకున్నారు.
ఫలితాలపరంగా చూస్తే నా జీవితంలో ఈ సీజన్ అత్యుత్తమమైనది. నిలకడగా విజయాలు సాధించాను. మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరాను. వింబుల్డన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లో చివరి సెట్‌ను 13–15తో ఓడిపోయాను. గాయాల కారణంగా గత రెండేళ్లు ఎంతో కఠినంగా గడిచాయి. ఈ ఏడాది సాధించిన విజయాలతో ఎంతో భావోద్వేగ అనుభూతి కలుగుతోంది. టెన్నిస్ అంటే గ్రాండ్‌స్లామ్ టోర్నీలే కాదు. రాబోయే నెలల్లో మరిన్ని టోర్నీలు జరగనున్నాయి. వాటిలో కూడా మెరుగైన ఫలితాలు సాధించాలనే పట్టుదలతో ఉన్నాను.
– రాఫెల్ నాదల్