ఎదురులేని నాదల్ | Rafel Nadal strikes again | Sakshi
Sakshi News home page

ఎదురులేని నాదల్

Published Fri, Sep 6 2013 1:09 AM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM

ఎదురులేని నాదల్

ఎదురులేని నాదల్

న్యూయార్క్: గాయంతో ఏడు నెలల పాటు ఆటకు దూరమైన ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ మళ్లీ గాడిలో పడ్డాడు. కచ్చితమైన సర్వీస్, బలమైన గ్రౌండ్ స్ట్రోక్స్‌తో బ్యాక్‌హాండ్, ఫోర్‌హ్యాండ్ షాట్లతో మునుపటి ఆటతీరును ప్రదర్శిస్తున్నాడు. ఫిబ్రవరిలో పునరాగమనం తర్వాత తొమ్మిది టైటిల్స్ గెలిచిన ఈ ప్రపంచ రెండో ర్యాంకర్ యూఎస్ ఓపెన్‌లోనూ అదరగొడుతున్నాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో రెండోసీడ్ నాదల్ 6-0, 6-2, 6-2తో సహచరుడు, 19వ సీడ్ టోమి రొబ్రెడో (స్పెయిన్)పై విజయం సాధించాడు.
 
 తద్వారా ఐదోసారి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. గంటా 40 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్.. యూఎస్ ఓపెన్‌లో అతి తక్కువ సమయం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌గా రికార్డులకెక్కింది. టోర్నీ మొత్తంలో ఒక్కసారి కూడా సర్వీస్ (67సార్లు) కోల్పోని నాదల్ ఈ మ్యాచ్‌లోనూ అదే ఊపును కొనసాగించాడు. సహచరుడి నుంచి పెద్దగా ప్రతిఘటన లేకపోవడంతో తొలిసెట్‌ను 22 నిమిషాల్లోనే ముగించాడు. మూడు బ్రేక్ పాయింట్లను కాపాడుకుని, రెండుసార్లు సర్వీస్‌ను నిలబెట్టుకున్నాడు. రెండో సెట్‌లో రొబ్రెడో కాస్త పుంజుకున్నట్లు కనిపించినా... ప్రత్యర్థి బలమైన స్ట్రోక్స్ ముందు నిలవలేకపోయాడు.
 
 నాదల్ నెట్ వద్ద నాలుగు పాయింట్లు గెలుచుకుని రెండు బ్రేక్ పాయింట్లను సద్వినియోగం చేసుకున్నాడు. రెండు ఏస్‌లను సంధించడంతో పాటు ఏడో గేమ్‌ను నిలబెట్టుకుని సెట్‌ను సొంతం చేసుకున్నాడు. మూడో సెట్‌లోనూ నెట్ వద్ద మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఐదు, ఏడో గేమ్‌ల్లో బ్రేక్ పాయింట్లు సాధించి సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో నాదల్ 28 విన్నర్లు సాధిస్తే... రొబ్రెడో 10తో సరిపెట్టుకున్నాడు. అయితే కీలక సమయంలో రొబ్రెడో డబుల్ ఫాల్ట్ (4) చేయడంతో పాటు 21సార్లు అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు.
 
 ఫెరర్ పోరాటం వృథా
 మరో క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ రిచర్డ్ గాస్కెట్ (ఫ్రాన్స్) 6-3, 6-1, 4-6, 2-6, 6-3తో నాలుగోసీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్)పై చెమటోడ్చి నెగ్గాడు. దీంతో 1999 తర్వాత సెమీస్‌కు చేరిన తొలి ఫ్రెంచ్ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. దాదాపు మూడు గంటలా 38 నిమిషాల పాటు జరిగిన ఐదు సెట్ల పోరాటంలో ఇద్దరు ఆటగాళ్లు చెరో రెండు సెట్‌లు గెలుచుకున్నారు. అయితే నిర్ణయాత్మక ఆఖరి సెట్ ఆరోగేమ్‌లో ఫెరర్ డబుల్ ఫాల్ట్ చేయడం గాస్కెట్‌కు కలిసొచ్చింది. దీంతో పుంజుకున్న గాస్కెట్ సర్వీస్‌ను నిలబెట్టుకుని మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో గాస్కెట్ 52 విన్నర్లు, 6 ఏస్‌లు సంధించాడు. 14 బ్రేక్ పాయింట్ అవకాశాల్లో ఆరింటిని సద్వినియోగం చేసుకున్నాడు. నెట్ వద్ద మెరుగ్గా ఆడిన ఫెరర్.. సర్వీస్‌లను నిలబెట్టుకోవడంలో కాస్త ఇబ్బందిపడ్డాడు. సెమీస్‌లో గాస్కెట్... నాదల్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.
 
 అజరెంకా జోరు
 మహిళల సింగిల్స్‌లో రెండోసీడ్ విక్టోరియా అజరెంకా (బెలారస్) జోరు కొనసాగుతోంది. క్వార్టర్‌ఫైనల్లో అజరెంకా 6-2, 6-3తో వరుస సెట్లలో డానియెల్ హంతుచోవా (స్లొవేకియా)పై గెలిచి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. గంటా 16 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో అజరెంకా ఏమాత్రం తడబడలేదు.
 
  ఆరంభంలో లభించిన మూడు బ్రేక్ పాయింట్లను చక్కగా సద్వినియోగం చేసుకుని ఆధిక్యం సంపాదించింది. తర్వాత సర్వీస్‌ను కాపాడుకుంటూ సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్‌లో హంతుచోవా పుంజుకోవడంతో బెలారస్ క్రీడాకారిణికి ఇబ్బంది ఎదురైంది. దీంతో 0-2తో వెనుకబడి పోయింది. అయితే హంతుచోవా వరుస తప్పిదాలు చేయడం అజరెంకాకు కలిసొచ్చింది. వరుసగా ఐదు గేమ్‌లు గెలిచి ఆధిక్యంలోకి దూసుకెళ్లి సెట్‌ను, మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది.
 
 మహిళల సెమీఫైనల్ నేడు
 సెరెనా (1) x నా లీ (5)
 పెనెట్టా x అజరెంకా (2)
 రాత్రి గం. 10.00 నుంచి
 టెన్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement