సాక్షి, హైదరాబాద్: వెస్టిండీస్-టీమిండియాల మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. టీమిండియా ఇంకా మూడు పరుగుల వెనుకంజలో ఉంది. యువ సంచలనం పృథ్వీషా(70) ధాటిగా ఆడగా.. వైస్ కెప్టెన్ అజింక్యా రహానే (75 బ్యాటింగ్) బాధ్యతాయుత ఇన్నింగ్ తోడుగా.. మరో విధ్వంసకర ఆటగాడు రిషభ్ పంత్ (85 బ్యాటింగ్) దూకుడుగా ఆడటంతో రెండో రోజు ఆటలో కోహ్లి సేన గౌరవప్రదమైన స్కోర్ చేసింది. వీరి అసాధారణ బ్యాటింగ్‌తో రెండో టెస్టుపై టీమిండియా పట్టు బిగించింది. కరీబియన్ బౌలర్లలో జాసన్ హోల్డర్ రెండు వికెట్లతో మెరవగా.. గాబ్రియల్, వ్యారికెన్ చెరో వికెట్ సాధించారు. (కోహ్లికి సాటెవ్వడూ!)
ఉమేశ్ పడగొట్టేశాడు
అంతకముందు 295/7 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం రెండో రోజు ఆటను ప్రారంభించిన విండీస్.. మరో 16 పరుగులు మాత్రమే జోడించి మిగతా మూడు వికెట్లను చేజార్చుకుంది. విండీస్ ఓవర్‌నైట్ ఆటగాడు రోస్టన్ ఛేజ్(106; 189 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) శతకంతో ఆకట్టుకున్నాడు. భారత బౌలర్ ఉమేశ్ యాదవ్ విజృంభించి ఆరు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు పృథ్వీషా దుకుడైన ఆటతో చక్కటి ఆరంభానిచ్చాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ తన వైపల్యాన్ని కొనసాగించాడు. ఆట ప్రారంభం పృథ్వీ షా తన ఫామ్‌ను కొనసాగించగా.. రాహుల్ తడబాటును కొనసాగిస్తూ హోల్డర్ బౌలింగ్‌లో వికెట్ పారేసుకున్నాడు. ఓపెనర్లు తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించగా అందులో రాహుల్ చేసినవి నాలుగు పరుగులే ఉండటం అతడి ఆటకు నిదర్శనం. అనంతరం నాలుగు పరుగుల వ్యవధిలోనే పృథ్వీషా, పుజారా(10) వికెట్లను విండీస్ బౌలర్ల పడగొట్టి కోహ్లి సేనను ఒత్తిడిలోకి నెట్టారు. (కేఎల్ రాహుల్ తొమ్మిదో‘సారీ’)
రహానే-పంత్‌ల భాగస్వామ్యం
ఈ సందర్భంలో జట్టు బాధ్యతను కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రహానేలు తీసుకున్నారు. ఆచితూచి ఆడుతూ విండీస్ బౌలర్లను ఎదుర్కొన్నారు. కోహ్లి-రహానే జోడి నాలుగో వికెట్‌కు 58 పరుగులు జోడించిన అనంతరం టీమిండియాకు మరో షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న సారథి కోహ్లిని(45) హోల్డర్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన విధ్వంసకర ఆటగాడు రిషభ్ పంత్ తన దైన శైలిలో దూకుడుగా ఆడాడు. మరో వైపు రహానే సంయమనంతో ఆడాడు. ప్రసుతం క్రీజులో రహానే, పంత్‌లు ఉన్నారు. ఇప్పటివరకు ఈ జోడి ఐదో వికెట్‌కు 146 పరుగులు జోడించింది. రహానే-పంత్‌లు మూడో రోజు కూడా నిలబడి భారీ ఆధిక్యాన్ని టీమిండియాకు అందిస్తే కరీబియన్ జట్టుపై పైచేయి సాధించినట్టే. (మెరిసిన రహానే-పంత్ జోడి)
Comments
Please login to add a commentAdd a comment