యశస్వి జైస్వాల్ ఇప్పుడు టీమిండియా క్రికెటర్. కష్టే ఫలితో ఎదిగాడు. 21 ఏళ్ల జైస్వాల్ ఎంపిక ఆశ్చర్యపరిచేది, అనూహ్య మైంది కానే కాదు. ఎందుకంటే కొన్నేళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో తన నిలకడైన ఆటతీరు చూపిస్తున్నాడు. ఐపీఎల్‌లో అయితే మెరుపులు మెరిపిస్తున్నాడు. ఈ సీజన్‌లో అయితే దిగ్గజాల ప్రశంసలు కూడా పొందాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు స్టాండ్‌బైగా ఇంగ్లండ్ వెళ్లొచ్చాడు. ఇప్పుడు కరీబియన్ టూర్ కోసం పూర్తిస్థాయి జట్టుకు ఎంపికయ్యాడు.
ముంబై: జైస్వాల్ యూపీ కుర్రాడు. అయితే ముంబైలో ఆటగాడయ్యాడు. ఐపీఎల్‌తో మెరుపు వీరుడిగా అందరికి పరిచయమై తాజాగా టీమిండియా జెర్సీ వేసుకోనున్నాడు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డు జట్టులో సభ్యుడయ్యాడు. హిట్టర్‌గా పేరుతెచ్చుకున్న 21 ఏళ్ల యశస్వి ఇప్పుడు టెస్టు క్రికెటర్‌గా ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి. జట్టులో తొలిసారి ఎంపికైన జైస్వాల్ తొలి పిలుపునే గొప్ప మలుపుగా చేసుకోవా లని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇంకా ఏమన్నాడంటే....
నాన్న భావోద్వేగం... నాకేమో ఆనందం...
ఈ తీపి కబురు తెలియగానే మా నాన్నకు భావోద్వేగంతో కన్నీళ్లు ఆగలేదు. బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఉన్న నాకేమో శుక్రవారం బిజిబిజీగా గడిచింది. నిజం చెప్పాలంటే ప్రాక్టీస్ కూడా చేయలేదు. టీమిండియాకు సంబంధించిన షూటింగ్‌లో పాల్గొన్నాను. భారత జట్టులోకి ఎంపికవడం చెప్పలేనంత ఆనందాన్నిచ్చింది. నా శక్తిమేర రాణించేందుకు కృషి చేస్తాను. టీమిండియా జెర్సీతో ఎప్పుడెప్పుడు ఆడాలా అన్న ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాను.
సన్నాహాలపైనే దృష్టి
నా సన్నాహాలు ఆశించినట్లే సాగుతున్నాయి. సీనియర్ ప్లేయర్ల సలహాలు, సంప్రదింపులతో ఆటతీరుకు మెరుగులు దిద్దుకుంటున్నా. ఇప్పుడైతే పూర్తిగా పని (బ్యాటింగ్) మీదే ధ్యాసంతా! ఎలా ఆడాలో ఎంత ముఖ్యమో ఎలా నడుచుకోవాలనేది అంతే ముఖ్యం. స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, అజింక్య రహానేల ఆటను చూసి ఎంతో నేర్చుకున్నాను. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచనలు కూడా నా బ్యాటింగ్‌కు దోహదపడ్డాయి.
ఏ స్థానమైనా సరే
నాకంటూ ఫలానా స్థానమే నప్పుతుందనే ప్రాధన్యతలేవీ లేవు. జట్టు అవసరాలు, జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయం మేరకు ఏ స్థానంలోనైనా బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాను. నాకు తెలిసిందల్లా పరుగులు చేయడమే. ఎక్కడ బరిలోకి దిగినా జట్టు కోసం శ్రమిస్తాను. క్రమశిక్షణతో ఎదుగుతాను. ఈ రెండే నా కెరీర్‌కు సోపానాలు.
కోచ్ సంబరం
పదేళ్ల క్రితం 2013లో ఆజాద్ మైదాన్(ముంబై)లో జైస్వాల్ ఆటకు ముగ్దుడినై అతన్ని శిక్షణ కోసం ఎంపిక చేశాను. అతను పడ్డ కష్టానికి ఐపీఎల్ అందలమెక్కించింది. ఓ దశాబ్దం చెమటోడ్చితే అతనిప్పుడు భారత క్రికెటర్ అయ్యాడు. అది చెప్పుకోవడానికి చాలా సంతోషంగా, ఎంతో సంబరంగా ఉంది. యశస్వి ఎదిగిన తీరు నాకెంతో ముచ్చటగా ఉంది. చాలా గర్వపడుతున్నాను. కరీబియన్‌లో బరిలోకి దిగుతాడనే నమ్మకముంది. ఎప్పట్లాగే రాణిస్తాడనే ఆశాభావం కూడా ఉంది.
– వ్యక్తిగత కోచ్ జ్వాలా సింగ్
Comments
Please login to add a commentAdd a comment