
సాక్షి, హైదరాబాద్: తొలి టెస్టులో ఘోర ఓటమి తర్వాత పర్యాటక వెస్టిండీస్ జట్టు పుంజుకుంది. శుక్రవారం ఆరంభమైన రెండో టెస్టులో విండీస్ బ్యాట్స్‌మెన్ తొలుత తడబడినా.. చివరికి నిలబడి జట్టుకు భారీ స్కోర్ అందించే ప్రయత్నం చేశారు. టీమిండియాతో ఉప్పల్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో రోస్టన్ ఛేజ్ (98 బ్యాటింగ్), కెప్టెన్ హోల్డర్(52) రాణించడంతో తొలి రోజు ఆటముగిసే సమయానికి కరీబియన్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో ఉమేశ్ యాదవ్, కుల్దీప్ యాదవ్‌లు చెరో మూడు వికెట్లు తీయగా.. అశ్విన్ ఒక్క వికెట్ సాధించాడు.
రాణించిన కుల్దీప్, ఉమేశ్
టాస్ గెలిచిన విండీస్ సారథి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అరంగేట్ర టీమిండియా బౌలర్ శార్దూల్ ఠాకూర్ పది బంతులేసిన అనంతరం గాయపడటంతో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను సారథి విరాట్ కోహ్లి రంగంలోకి దింపాడు. అశ్విన్ వచ్చీ రాగనే ఓపెనర్ పావెల్(22)ను వెనక్కి పంపించారు. మరో వైపు ఆచితూచి ఆడుతున్న బ్రాత్‌వైట్(14)ను కుల్దీప్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కుల్దీప్ దెబ్బకి విండీస్ మిడిలార్డర్ మరోసారి విఫలమవ్వడంతో 113 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మరోవైపు పేసర్ ఉమేశ్ యాదవ్ వీలు చిక్నిప్పుడల్లా వికెట్లు తీస్తూ కరీబియన్ జట్టుపై ఒత్తిడి పెంచాడు.
చేజ్, హోల్డర్‌ల పోరాటం అదుర్స్
విండీస్ తొలి రోజు నిలబడిందంటే క్రెడిట్ మొత్తం రోస్టన్ చేజ్‌దే. ఓ వైపు వికెట్లు పడుతున్న పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడాడు. వికెట్ కీపర్ డౌరిచ్(30)తో కలిసి ఆరో వికెట్‌కు 69 పరుగులు జోడించాడు. డౌరిచ్ ఔటైన అనతంరం క్రీజులోకి వచ్చిన సారథి జాసన్ హోల్డర్(52) చేజ్‌కు జతకలిశాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధిస్తూ ఇరువురూ అర్థశతకాలు సాధించారు. ప్రమాదకరంగా మారుతున్న హోల్డర్‌ను ఉమేశ్ ఔట్ చేశాడు. దీంతో ఏడో వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆటముగిసే సమయానికి ఛేజ్‌కు తోడుగా దేవేంద్ర బిషూ(2 బ్యాటింగ్)క్రీజ్‌లో ఉన్నాడు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment