అతని రీఎంట్రీ ఖాయం.. బెట్‌ వేస్తా: రాయుడు | Raina Has Lot Of Cricket Left In Him, Ambati Rayudu | Sakshi
Sakshi News home page

అతని రీఎంట్రీ ఖాయం.. బెట్‌ వేస్తా: రాయుడు

Published Mon, May 4 2020 3:27 PM | Last Updated on Mon, May 4 2020 3:52 PM

Raina Has Lot Of Cricket Left In Him, Ambati Rayudu - Sakshi

న్యూఢిల్లీ: టీ​మిండియా సీనియర్‌ క్రికెటర్‌ సురేశ్‌ రైనా రీఎంట్రీపై సహచర సీఎస్‌కే ఆటగాడు అంబటి రాయుడు ధీమా వ్యక్తం చేశాడు. సురేశ్‌ రైనాకు ఇంకా చాలా క్రికెట్‌ మిగిలే ఉందని, అతను మళ్లీ భారత్‌ తరఫున ఆడటం పక్కా అని  రాయుడు ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. సీఎస్‌కే ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో పలు విషయాల్ని రాయుడు పంచుకున్నాడు. దీనిలో భాగంగా సురేశ్‌ రైనా రీఎంట్రీపై ఆశాభావం వ్యక్తం చేశాడు. రైనా మళ్లీ భారత్‌ జట్టుకు ఆడతాడనే విషయంలో పందెం కూడా ఖాయడానికి కూడా సిద్ధమన్నాడు. అతనిలో ఇంకా బోలెడు క్రికెట్‌ మిగిలే ఉందని, అదే  అతన్ని  టీమిండియా తరఫున ఆడేలా చేస్తుందన్నాడు. అతను ఆటను చాలా దగ్గర్నుంచీ చూసిన వ్యక్తులలో తాను ఒకడినని, దాంతో రైనా పునరాగమనంపై కచ్చితంగా చెప్పగలుగుతున్నానన్నాడు. లాక్‌డౌన్‌కు ముందు సీఎస్‌కే నిర్వహించిన ప్రాక్టీస్‌ సెషన్‌లో రైనాలో ఒక కొత్త ఆటగాడిని చూశానని అంబటి రాయుడు పేర్కొన్నాడు. మళ్లీ బ్లూ జెర్సీ  ధరించడానికి రైనాకు ఎంతో సమయం పట్టదన్నాడు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో అంబటి రాయుడు జట్టులోకి సెలక్ట్‌ అయ్యే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడనే చెప్పాలి. (విజయ్‌తో డిన్నర్‌కు ఓకే చెప్పిన ఎలిస్‌)

రిజర్వ్‌ ఆటగాళ్లలో అంబటి రాయుడు ఉన్నప్పటికీ చివరి నిమిషంలో దాన్ని మిస్సయ్యాడు.విజయ​ శంకర్‌ గాయం కారణంగా స్వదేశానికి పయనమైన నేపథ్యంలో రాయుడు ఇంగ్లండ్‌కు పయనం అవుతాడని అంతా అనుకున్నారు. కానీ రిషభ్‌ పంత్‌కు అవకాశం ఇవ్వడంతో రాయుడుకు నిరాశే ఎదురైంది. ఆ ఊహించని పరిణామంతో క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించిన రాయుడు.. కొన్ని  రోజుల తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఆ క్రమంలోనే హైదరాబాద్‌ రంజీ జట్టుకు  రాయుడు కెప్టెన్‌గా ఎంపిక  కావడం జరిగింది.కాగా,హెచ్‌సీఏలో అవినీతి జరుగుతుందంటూ ఆరోపించిన రాయుడు తన కెప్టెన్సీ పదవిని వదులుకున్నాడు. ఎప్పుడూ  తన మాటల ద్వారానే కాకుండా ఆటలో కూడా దూకుడుగా కనిపించే రాయుడు.. మళ్లీ భారత్‌ జట్టులో రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నాడు. గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్‌లో  సీఎస్‌కే తరఫున ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే అదే జట్టుకు ఆడుతున్న  రైనా రీఎంట్రీపై అంబటి రాయుడు తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఇక  రైనా విషయానికొస్తే భారత్‌ తరఫున మ్యాచ్‌  ఆడి దాదాపు రెండేళ్లు అవుతుంది. 2018లో చివరిసారి మెన్‌ ఇన్‌ బ్లూ జెర్సీలో కనిపించిన రైనా కూడా  రీఎంట్రీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. గతంలో ఒకానొక సందర్భంలో తనను కూడా పరిశీలనలోకి తీసుకోవాలని టీమిండియా సెలక్టర్లకు రైనా విన్నవించిన సంగతి తెలిసిందే. (కెప్టెన్సీపై తిరుగుబాటు చేశారు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement