రాహుల్‌ నిలిచినా... రాయల్స్‌ నెగ్గింది | Rajasthan Royals won by 15 runs | Sakshi
Sakshi News home page

రాహుల్‌ నిలిచినా... రాయల్స్‌ నెగ్గింది

Published Wed, May 9 2018 1:09 AM | Last Updated on Wed, May 9 2018 7:08 AM

Rajasthan Royals won by 15 runs - Sakshi

తలపడింది రెండు జట్లు. కానీ... పోరాడింది మాత్రం ఓపెనర్లే! దీంతో ఇరు జట్ల ఓపెనింగ్‌ సమరంలో బట్లర్‌ ఇన్నింగ్స్‌దే పైచేయి అయింది. రాహుల్‌ ఆఖరిదాకా నిలిచినా పంజాబ్‌ను గట్టెక్కించలేకపోయాడు. అతనొక్కడే 95 పరుగులు చేస్తే... మిగతావారు 41 పరుగులే చేశారు.   

జైపూర్‌: రాజస్తాన్‌ రాయల్స్‌ దెబ్బకుదెబ్బ తీసింది. పంజాబ్‌ చేతిలో వారి సొంతగడ్డపై ఎదురైన పరాజయానికి తమ సొంతగడ్డపై ప్రతీకారం తీర్చుకుంది. మూడు మ్యాచ్‌ల తర్వాత మళ్లీ రాయల్స్‌ గెలిచింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రహానే బృందం 15 పరుగుల తేడాతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై విజయం సాధించింది. తొలుత రాజస్తాన్‌ రాయల్స్‌ 8 వికెట్లకు 158 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బట్లర్‌ (58 బంతుల్లో 82; 9 ఫోర్లు, 1 సిక్స్‌) ఒక్కడే రాయల్స్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. కింగ్స్‌ బౌలర్లలో ఆండ్రూ టై 4 వికెట్లు తీశాడు. తర్వాత పంజాబ్‌ 7 వికెట్లకు 143 పరుగులు చేసి ఓడింది. రాహుల్‌ (70 బంతుల్లో 95 నాటౌట్‌; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) కడదాకా పోరాడాడు.  

బట్లర్‌ ఆదుకున్నాడు.... 
రాయల్స్‌ ఇన్నింగ్స్‌కు మళ్లీ బట్లరే పెద్దదిక్కయ్యాడు. పంజాబ్‌ బౌలర్లు అతనొక్కడి పోరాటాన్ని ఆడ్డుకోలేకపోయారు. ఓపెనర్‌గా దిగిన బట్లర్‌... రహానే (9; 1 ఫోర్‌)తో కలిసి తొలి వికెట్‌కు 37 పరుగులు, గౌతమ్‌ (8; 1 సిక్స్‌)తో కలిసి 27 పరుగులు జోడించాడు. తర్వాత శామ్సన్‌ జతయ్యాడు. ఈ క్రమంలో బట్లర్‌ 27 బంతుల్లో అర్ధసెంచరీ (7 ఫోర్లు, 1 సిక్స్‌) పూర్తి చేసుకున్నాడు. ఇద్దరు క్రీజులో కుదురుకున్నప్పటికీ స్కోరులో మాత్రం వేగం పెరగలేదు. చేతిలో వికెట్లున్నప్పటికీ జట్టు వంద పరుగులు చేసేందుకు 13 ఓవర్లు ఆడాల్సి వచ్చింది. ఇక ధనాధన్‌ మెరిపించాల్సిన సమయంలో ముజీబ్‌ తన వరుస ఓవర్లలో వీళ్లిద్దరిని పెవిలియన్‌ చేర్చాడు. జట్టు స్కోరు 117 వద్ద శామ్సన్‌ (18 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్‌)ను, తర్వాత కాసేపటికి జోరుమీదున్న బట్లర్‌ను ఔట్‌ చేశాడు   

కింగ్స్‌ కూలింది టపటపా... 
ప్రత్యర్థి జట్టును బాగానే కట్టడి చేశామన్న ఆనందంతో లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు ఆరంభంలోనే అష్టకష్టాలు ఎదురయ్యాయి. గేల్‌తో మొదలైన పతనం అక్షర్‌ వికెట్‌ దాకా క్రమం తప్పకుండా సాగింది. పంజాబ్‌ ఇన్నింగ్స్‌కు లోకేశ్‌ రాహుల్‌ వెన్నెముకగా నిలిచినప్పటికీ... రాయల్స్‌ బౌలర్లు తెలివిగా అవతలి ఎండ్‌లో వికెట్లు పడగొట్టడంతో ఓటమి తప్పలేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement