రాయల్స్‌ రేసులోనే... | Rajasthan Royals beat Kings XI Punjab by 7 wickets | Sakshi
Sakshi News home page

రాయల్స్‌ రేసులోనే...

Published Sat, Oct 31 2020 4:49 AM | Last Updated on Sat, Oct 31 2020 9:16 AM

Rajasthan Royals beat Kings XI Punjab by 7 wickets - Sakshi

బెన్‌ స్టోక్స్‌, క్రిస్‌ గేల్‌

రాజస్తాన్‌ రాయల్స్‌ ఊపిరి పీల్చుకుంది. ‘యూనివర్సల్‌ బాస్‌’ గేల్‌ విధ్వంసాన్ని తట్టుకొని నిలిచింది. ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శనతో అద్భుత  విజయాన్ని అందుకుంది. ముందుగా ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో స్టోక్స్‌ గెలుపునకు పునాది వేయగా... సంజూ సామ్సన్, స్మిత్, బట్లర్‌ జట్టును గమ్యానికి చేర్చారు. దీంతో రాజస్తాన్‌ ప్లే ఆఫ్స్‌ రేసులో  మరో అడుగు ముందుకేసింది. కీలక సమయంలో బౌలర్లు చేతులెత్తేయడంతో పంజాబ్‌ ఓటమి పాలై తమ అవకాశాలను కాస్త సంక్లిష్టం చేసుకుంది.
 
అబుదాబి: అసలైన సమయంలో రాజస్తాన్‌ రాయల్స్‌ సత్తా చాటింది. సమష్టి ప్రదర్శనతో ప్రత్యర్థిని ముంచింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బెన్‌ స్టోక్స్‌ (26 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సంజూ సామ్సన్‌ (25 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విజృంభించడంతో... శుక్రవారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు ఏడు వికెట్లతో గెలుపొందింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 185 పరుగులు చేసింది. క్రిస్‌ గేల్‌ (63 బంతుల్లో 99; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) ఒక్క పరుగు తేడాతో సెంచరీ కోల్పోయాడు. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (41 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), పూరన్‌ (10 బంతుల్లో 22; 3 సిక్సర్లు) రాణించారు. ఆర్చర్, స్టోక్స్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 186 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్‌ రాయల్స్‌ 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (20 బంతుల్లో 31 నాటౌట్‌; 5 ఫోర్లు), బట్లర్‌ (11 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్సర్లు) నాలుగో వికెట్‌కు అజేయంగా 19 బంతుల్లో 41 పరుగుల్ని జోడించి జట్టును విజయతీరాలకు చేర్చారు.   

తొలి ఓవర్‌లోనే వికెట్‌...
ఆరంభంలోనే పంజాబ్‌కు షాక్‌ తగిలింది. ఆర్చర్‌ బౌలింగ్‌లో స్టోక్స్‌ చక్కటి క్యాచ్‌కు ఓపెనర్‌ మన్‌దీప్‌ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాత రాహుల్‌కు గేల్‌ జతకూడటంతో రాయల్స్‌ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పరాగ్, ఉతప్ప సమన్వయలేమితో ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్న గేల్‌... కార్తీక్‌ త్యాగి ఓవర్‌లో వరుసగా 4, 6, 4 రెచ్చిపోయాడు. ఆరోన్‌ బౌలింగ్‌లో రాహుల్‌ కూడా 6, 4 బాదడంతో పవర్‌ ప్లేలో పంజాబ్‌ 53/1తో నిలిచింది.  

పటిష్ట భాగస్వామ్యం...
తర్వాత కూడా వీరిద్దరూ బాధ్యతాయుతంగా ఆడారు. ప్రతీ బంతిపై ఎదురుదాడి చేయకుండా ఆచితూచి బౌండరీలు బాదారు. మిడిల్‌ ఓవర్లలో రన్‌రేట్‌ 8కి తగ్గకుండా పరుగులు సాధించారు. రాహుల్‌ తేవటియా బౌలింగ్‌లో భారీ సిక్సర్‌ బాదిన గేల్‌ 33 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో అతనికిది మూడో ఫిఫ్టీ. ఈ దశలో గేల్‌ మరోసారి బతికిపోయాడు. మరోవైపు అర్ధసెంచరీకి చేరువవుతోన్న రాహుల్‌ను స్టోక్స్‌ పెవిలియన్‌ పంపాడు. దీంతో రెండో వికెట్‌కు 82 బంతుల్లో 120 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.  

సిక్సర్ల హోరు...
చివరి ఐదు ఓవర్లలో పూరన్, గేల్‌ ఆరు సిక్సర్లతో అలరించారు. ఆరోన్‌ ఓవర్‌లో రెండు భారీ సిక్సర్లు, త్యాగి బౌలింగ్‌లో మరొకటి కొట్టి పూరన్‌ ప్రమాదకరంగా కనిపించాడు. బౌండరీ వద్ద తేవటియా క్యాచ్‌కు అతను ఔటైనా... గేల్‌ 4, 6తో 14 పరుగులు రాబట్టాడు. తర్వాత మరో రెండు సిక్సర్లు కొట్టి సెంచరీకి సమీపించిన గేల్‌ను ఆర్చర్‌ అద్భుత యార్కర్‌తో నిలువరించాడు. చివరి 30 బంతుల్లో పంజాబ్‌ 62 పరుగులు రాబట్టింది.  

స్టోక్స్‌ విధ్వంసం...
ఉతప్పతో కలిసి ఛేదనకు దిగిన స్టోక్స్‌ కసిగా ఆడాడు. తొలి 3 ఓవర్లలో నాలుగు ఫోర్లు బాదాడు. నాలుగో ఓవర్‌లో వరుసగా 4, 6, 6తో 16 పరుగులు పిండుకున్నాడు. తర్వాత 4, 6 బాదిన స్టోక్స్‌ 24 బంతుల్లోనే అర్ధసెంచరీ అందుకున్నాడు. ప్రమాదకరంగా మారుతోన్న స్టోక్స్‌ను జోర్డాన్‌ పెవిలియన్‌ పంపాడు. అనంతరం సామ్సన్‌ బ్యాట్‌ ఝళిపించడంతో 10 ఓవర్లకు రాజస్తాన్‌ 103/1తో నిలిచింది. తర్వాతి ఓవర్‌లోనే ఉతప్ప (30; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఔటైనా... స్మిత్‌తో కలిసి సామ్సన్‌ ఇన్నింగ్స్‌ నడిపించాడు. వీరిద్దరూ 21 బంతుల్లో 34 పరుగులు జోడించాక సామ్సన్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. అప్పటికే జట్టు ç146/3తో పటిష్ట స్థితిలో నిలిచింది.

బట్లర్, స్మిత్‌ జోరు  
భారీ విజయంపై కన్నేసిన స్మిత్, బట్లర్‌ చివర్లో చెలరేగారు. 30 బంతుల్లో 40 పరుగులు చేయాల్సి ఉండగా సిక్సర్‌తో బట్లర్‌ జోరు పెంచాడు. షమీ వేసిన 17వ ఓవర్‌లో స్మిత్‌ 3 ఫోర్లు, బట్లర్‌ మరో బౌండరీతో 19 పరుగులు రాబట్టారు. జోర్డాన్‌ ఓవర్‌లో మరో సిక్సర్‌ బాదిన బట్లర్‌ 15 బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్నందించాడు. వీరిద్దరూ చివరి 10 బంతుల్లో 30 పరుగులు చేశారు.   

స్కోరు వివరాలు
కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌: కేఎల్‌ రాహుల్‌ (సి) రాహుల్‌ తేవటియా (బి) స్టోక్స్‌ 46; మన్‌దీప్‌ సింగ్‌ (సి) స్టోక్స్‌ (బి) ఆర్చర్‌ 0; క్రిస్‌ గేల్‌ (బి) ఆర్చర్‌ 99; నికోలస్‌ పూరన్‌ (సి) రాహుల్‌ తేవటియా (బి) స్టోక్స్‌ 22; మ్యాక్స్‌వెల్‌ (నాటౌట్‌) 6; దీపక్‌ హుడా (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 185.
వికెట్ల పతనం: 1–1, 2–121, 3–162, 4–184.
బౌలింగ్‌: ఆర్చర్‌ 4–0–26–2; వరుణ్‌ ఆరోన్‌ 4–0–47–0; కార్తీక్‌ త్యాగి 4–0–47–0; శ్రేయస్‌ గోపాల్‌ 1–0–10–0; స్టోక్స్‌ 4–0–32–2; రాహుల్‌ తేవటియా 3–0–22–0.

రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: రాబిన్‌ ఉతప్ప (సి) పూరన్‌ (బి) మురుగన్‌ అశ్విన్‌ 30; స్టోక్స్‌ (సి) దీపక్‌ హుడా (బి) జోర్డాన్‌ 50; సామ్సన్‌ (రనౌట్‌) 48; స్మిత్‌ (నాటౌట్‌) 31; బట్లర్‌ (నాటౌట్‌) 22; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (17.3 ఓవర్లలో మూడు వికెట్లకు) 186.
వికెట్ల పతనం: 1–60, 2–111, 3–145.
బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ సింగ్‌ 3–0–34–0, షమీ 3–0–36–0, మురుగన్‌ అశ్విన్‌ 4–0–43–1, క్రిస్‌ జోర్డాన్‌ 3.3–0–44–1, రవి బిష్ణోయ్‌ 4–0–27–0. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement