దుబాయ్ : ఆస్ట్రేలియా మాజీ బౌలర్, స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ వెస్టీండీస్ క్రికెటర్ మార్లన్ శామ్యూల్స్ పై ట్విటర్ వేదికగా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. వార్న్ శామ్యూల్స్‌పై ఇంతలా ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక ఒక కారణం ఉంది. అదేంటంటే... ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఐపీఎల్ 13వ సీజన్‌లో ఆడడానికి ముందు రెండు వారాలు క్వారంటైన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. తన లైఫ్‌లో అత్యంత శత్రువుగా భావించే వ్యక్తితో కలిసి రెండు వారాలు క్వారంటైన్‌లో ఉండడలేని పరోక్షంగా శామ్యూల్స్ పేరును ప్రస్తావించాడు. దీనికి వార్నర్ స్పందిస్తూ 'నువ్వు చెప్పింది నిజం' అంటూ స్టోక్స్‌కు మద్దతు తెలిపాడు. అయితే శామ్యూల్స్ స్పందిస్తూ.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో బెన్ స్టోక్స్, షేన్ వార్న్‌లనుద్దేశించి కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడు. అంతేగాక తనకు ఉన్నతమైన స్కిన్ టోన్ ఉందంటూ జాత్యహంకార వ్యాఖ్యలు కూడా చేశాడు. దీంతోపాటు స్టోక్స్ భార్యపై కూడా అసభ్యకరవ్యాఖ్యలు చేయడం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. (చదవండి : అతని ఆట నాకు ఆశ్చర్యం కలిగించింది)
దీనిపై తాజాగా వార్న్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. 'నాతో పాటు స్టోక్స్‌పై చేసిన వ్యాఖ్యలను ఇప్పుడే తిరిగి శామ్యూల్స్‌కు పంపించా. అతని వ్యాఖ్యలు సరైనవి కావు. ఒక వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడడంతో పాటు కుటుంబసభ్యులను కూడా ఇందులోకి లాగడం బాధాకరమైన విషయం. శామ్యూల్స్‌కు మతి చెడింది.. ఇప్పుడు అతనికి సహాయం అవసరం... కానీ దురదృష్టం కొద్దీ అతనికి స్నేహితులు ఎవరు లేరు.. కనీసం తోటి క్రికెటర్లు కూడా అతనికి సాయంగా రారు.ఎందుకంటే అతనొక సాధారణ క్రికెటర్.. అందుకే ఎవరి వద్ద నుంచైనా వెంటనే సాయం కోరు 'అంటూ చురకలంటించాడు.
కాగా స్టోక్స్ ఐపీఎల్ 13వ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. షేన్ వార్న్ అదే జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇంతకముందు కూడా స్టోక్స్, వార్న్‌లతో శామ్యూల్స్‌కు విభేదాలు ఉన్నాయి. అయితే తాజా గొడవ ఇప్పట్లో ముగిసేలా లేదు. దీనిపై శామ్యూల్స్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాడో చూడాలి. కాగా ఐపీఎల్ 13వ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ అంచనాలు అందుకోలేక చతికిలపడుతుంది. మొత్తం 12 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 7 ఓటములతో టేబుల్‌లో 7వ స్థానంలో ఉన్న రాజస్తాన్ ప్లేఆఫ్‌కు చేరడం కొంచెం కష్టమే అని చెప్పొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment