దుబాయ్ : రాజస్తాన్ రాయల్స్‌లో కీలక ఆటగాడిగా చెప్పుకుంటున్న ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఆ జట్టులో చేరడం వారికి కాస్త బలం చేకూరుస్తుందనే చెప్పొచ్చు. ఐపీఎల్ 13వ సీజన్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచిన రాజస్తాన్ తర్వాత హ్యాట్రిక్ ఓటములతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. ఈ దశలో అక్టోబర్ 11న సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో స్టోక్స్ ఆడే అవకాశం ఉంది. కాగా అక్టోబర్ 4న (శనివారం ఉదయం) క్రైస్ట్‌చర్చి ఎయిర్‌పోర్ట్‌లో తన తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫోటోను స్టోక్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా స్టోక్స్.. క్రైస్ట్‌చర్చి నుంచి యూఏఈ రావడానికి ఎంత సమయం పడుతుందో చెప్పండి అంటూ రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం తన ట్విటర్‌లో కామెంట్‌ను షేర్ చేసింది. ఈ సందర్భంగా ట్వీట్ చూసిన స్టోక్స్ కాస్త ఎమోషనల్‌కు గురయ్యాడు. (చదవండి : స్టోక్స్ వచ్చాడు.. క్వారంటైన్‌కు వెళ్లాడు)
'మనకు నచ్చిన వారిని వదిలిరావడం అనేది ఎంతో కష్టంగా ఉంటుంది. ఐపీఎల్ ఆడడానికి వచ్చే ముందు ఎయిర్‌పోర్ట్‌లో నా తండ్రి, తల్లి, సోదరుడికి గుడ్‌బై చెప్పడంలో కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నా. కరోనా కాలంలో నా తల్లిదండ్రుల వద్ద మంచి టైమ్ స్పెండ్ చేశాను.. ఐపీఎల్ కోసం ఈ సమయంలో వారిని వదిలిపెట్టి వెళ్లడంపై నాకు బాధగా ఉన్నా మరోవైపు సంతోషం ఉంది. ఎందుకంటే నేను వెళ్తున్నది నాకు ఇష్టమైన ఆట దగ్గరికి.. దీనికి నా కుటుంబసభ్యులు కూడా అడ్డుచెప్పలేరు. ఇంతకాలం వారితో కలిసి ఉన్నా అనే ఒక్క ఫీలింగ్ బాధ కలిగేలా చేస్తుంది. నా తల్లిదండ్రుల వద్దకు వచ్చిన మొదట్లో ఒక వారంపాటు క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత వారితో కలిసి ఎన్నో మధురక్షణాలు గడిపాను. క్యాన్సర్‌తో బాధపడుతున్న నా తండ్రిని కంటికి రెప్పలా చూసుకున్నాను. కానీ ఐపీఎల్‌కు వెళ్లే సమయం రావడంతో నా తండ్రికి, తల్లికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. కానీ వారు ఇచ్చిన ఆశీర్వాదంతోనే దుబాయ్‌లో అడుగుపెడుతున్నా. రాజస్తాన్ రాయల్స్‌కు ఆడడానికి ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నా' అంటూ చెప్పుకొచ్చాడు. (చదవండి : ముంబై జబర్దస్త్ విజయం)
న్యూజిలాండ్‌లో ఉండే స్టోక్స్ తండ్రి క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో గత నెల పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్ నుంచి తప్పుకున్నాడు. తండ్రి వద్దనే ఉంటూ ఐపీఎల్ ఆరంభపు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. న్యూజిలాండ్ దేశస్తుడైన స్టోక్స్.. ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ను ఇంగ్లండ్ సాధించడంలో స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment