
కరాచీ: మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడి సుదీర్ఘ కాలం శిక్షను ఎదుర్కొని జాతీయ జట్టులో పునరాగమనం కోసం చేస్తున్నపాకిస్తాన్ క్రికెటర్లపై ఆ దేశ మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత రమీజ్ రాజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ప్రధానంగా సల్మాన్ భట్ తిరిగి పాకిస్తాన్ జాతీయ జట్టులో తిరిగి ఆడటానికి పచ్చజెండా ఊపడాన్ని రమీజ్ నిలదీశాడు. అసలు అతనికి మళ్లీ ఆడే అవకాశాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఎందుకు కల్పించాల్సి వచ్చిందంటూ ప్రశ్నించాడు. అదే సమయంలో పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) లో స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడిన వారికి సైతం ఎంతో దయార్ద్ర హృదయంతో శిక్షలు వేస్తున్నారని రమీజ్ చమత్కరించాడు.
'పాకిస్తాన్ క్రికెట్ లో ఫిక్సింగ్ అనేది భాగంగా మారిపోయింది. అందుకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు లేవనే నేను అనుకుంటున్నా. పీఎస్ఎల్ లో ఫిక్సింగ్ కు పాల్పడిన వారిపై సైతం కఠిన చర్యలు లేవు. సల్మాన్ భట్ కు మళ్లీ జాతీయ జట్టులో ఆడటానికి గ్రీన్ సిగ్నల్ ఎందుకు ఇచ్చినట్లు. అతనొక 'రోగ్' క్రికెటర్. అతని మళ్లీ అవకాశం కల్పించడంతో పీసీబీ ఏమీ చెప్పదలుచుకుంది' అని రమీజ్ ఘాటుగా వ్యాఖ్యానించాడు.
స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఐదేళ్ల నిషేధాన్ని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ గతేడాది పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. 2010 ఇంగ్లండ్ పర్యటనలో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన భట్, ఆసిఫ్, ఆమిర్ త్రయం జైలు కెళ్లడంతో పాటు ఐదేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. వీరిలో ఇప్పటికే అమిర్ పాక్ జట్టులో పునరాగమనం చేయగా, ఆసిఫ్ తిరిగి ఆడటానికి కొన్ని నెలల క్రితం పీసీబీ అనుమతినిచ్చింది.