వ్యక్తిగత కోచ్లను అనుమతించడం వల్లే..
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్లో పాల్గొంటున్న షూటర్ల పేలవ ప్రదర్శనపై భారత రైఫిల్ అసోసియేషన్ అధ్యక్షుడు రణీందర్ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో తనను నిందించుకోవడం తప్ప చేసేదేమీ లేదంటూ ఆవేదన చెందారు. కొంతమంది షూటర్లకు వ్యక్తిగత కోచ్లను అనుమతించమే తాము చేసిన అతి పెద్ద తప్పిదమని రణీందర్ పేర్కొన్నారు.ఈ విషయంపై భవిష్యత్తులో తాము ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
'పలువురు వ్యక్తిగత కోచ్లను నియమించుకోవడానికి గతంలో అనుమతినిచ్చాం. అదే మేము గుడ్డిగా చేసిన తప్పిదం. ఈ కారణం చేత తుది ఫలితం రాబట్టడంలో విఫలమయ్యాం. ముఖ్యంగా ముగ్గురు అథ్లెట్ల ప్రదర్శన చాలా పేలవంగా ఉండగా, మిగతా వారు బాగానే ఆకట్టుకున్నారు'అని ఆయా షూటర్ల పేర్లను ప్రస్తావించని రణీందర్ విమర్శలు గుప్పించారు. రియో ఒలింపిక్స్కు 12 మంది షూటర్ల బృందం వెళితే ప్రదర్శన ఎంతమాత్రం ఆశాజనకంగా లేదన్నారు. దీనిపై తనను విమర్శించుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్నాడు.
ఇప్పటికే పలు ఒలింపిక్స్లో పాల్గొన్న ఒక భారత షూటర్ ఏ ఒక్క దాంట్లోనూ కనీసం ప్రదర్శన చేయలేదని గగన్ నారంగ్ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. దీనిపై తమ ఫెడరేషన్ సీరియస్ దృష్టి సారించిందని రణీందర్ పేర్కొన్నాడు.