
న్యూఢిల్లీ: టీమిండియా బిజీ షెడ్యూల్లో భాగమయ్యేందుకు ఎదురు చూస్తున్న ఆటగాళ్లకు చక్కని అవకాశం రానేవచ్చింది. వర్ధమాన క్రికెటర్లతో పాటు ఫామ్ కోల్పోయిన స్టార్ ఆటగాళ్లు రంజీ ట్రోఫీ బరిలోకి దిగేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (సౌరాష్ట్ర), ఓపెనర్ మురళీ విజయ్ (తమిళనాడు), బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా (సౌరాష్ట్ర), టెస్టు కీపర్ సాహా, పేసర్లు షమీ (బెంగాల్), ఇషాంత్ శర్మ (ఢిల్లీ) లు రంజింపచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. తొలి రౌండ్ మ్యాచ్‌లు వివిధ రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి జరుగుతాయి. గత సీజన్‌లో ప్రయోగాత్మకంగా నిర్వహించిన తటస్థ వేదికల మ్యాచ్‌లను రద్దు చేశారు. ఆటగాళ్ల ప్రయాణ బడలిక, 28 జట్లకు సదుపాయాల కల్పన పనికి మించిన భారం కావడంతో బీసీసీఐ మళ్లీ పాత పద్ధతివైపే మొగ్గు చూపింది. అంటే ఇరు జట్లు ఇంటా బయటా మ్యాచ్‌ల్లో తలపడతాయి.
భారత క్రికెట్‌లో రాహుల్ ద్రవిడ్ వారసుడిగా కితాబు అందుకుంటున్న చతేశ్వర్ పుజారా సౌరాష్ట్ర సారథిగా వ్యవహరించనున్నాడు. ఇదే జట్టులో జడేజా కూడా ఉండటం సౌరాష్ట్రను మరింత పటిష్టపరిచింది. తమిళనాడుకు ఇటు బ్యాటింగ్‌లో మురళీ విజయ్, బౌలింగ్‌లో అశ్విన్ బలమయ్యారు. తెలుగు జట్లు హైదరాబాద్ గ్రూప్ ‘ఎ’లో ఆంధ్ర ‘సి’లో పోటీపడతాయి. శుక్రవారం తమ తొలి లీగ్ మ్యాచ్‌ల్లో మహారాష్ట్రతో హైదరాబాద్; తమిళనాడుతో ఆంధ్ర తలపడతాయి. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ తమ తొలి మ్యాచ్‌లో కేరళతో ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment