
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా ప్రయాణం గురువారం మొదలుకానుంది. ఈ ఐసీసీ టోర్నమెంట్ ఆరంభ మ్యాచ్‌లో రోహిత్ సేన తొలుత దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఆరంభమయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, జియోహాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు.
గంభీర్‌తో జడ్డూ వాదన!
ఇక తొలి మ్యాచ్‌లో భారత తుదిజట్టు ఎలా ఉంటుందన్న అంశంపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తినెలకొంది. ఏకంగా ఐదుగురు స్పిన్నర్లను సెలక్ట్ చేసిన భారత జట్టు యాజమాన్యం ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరికి చోటు ఇస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir)తో చర్చిస్తున్నట్లు కనిపించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో జడ్డూకు గౌతీ తుదిజట్టులో స్థానం ఇవ్వడం లేదని.. తనకు ఇష్టమైన వాషింగ్టన్ సుందర్‌ను ఆడిస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మాజీ కోచ్ మైక్ హసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
నీకు తుదిజట్టులో చోటు లేదు.. అతడినే ఆడిస్తాం
‘‘జడేజా ఈరోజు మ్యాచ్ ఆడటం లేదు. అతడి బాడీలాంగ్వేజ్ చూస్తే ఇలాగే అనిపిస్తోంది. ‘నా నిర్ణయం ఇదే. నేను ఫిక్సైపోయాను. నువ్వు నా నిర్ణయంతో అంగీకరించకపోవచ్చు. అయినా మరేం పర్లేదు. థాంక్స్.. తదుపరి మ్యాచ్‌లో నువ్వే ఆడతావు. కానీ ఇప్పుడు మాత్రం మేము ఆఫ్ స్పిన్నర్‌తో బరిలోకి దిగుతాం’ అని గంభీర్ జడేజాకు చెప్పి ఉంటాడు’’ అని మైక్ హసన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
వాళ్లిద్దరికి జట్టులో చోటు
అయితే, టీమిండియా మాజీ క్రికెటర్ పీయూశ్ చావ్లా మాత్రం.. ‘‘బంగ్లాదేశ్ తుదిజట్టులో ఎక్కువ మంది ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉన్నారు. గత కొద్ది రోజులుగా జడేజా, అక్షర్ మంచి ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి వాళ్లిద్దరికి జట్టులో చోటు ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా బంగ్లా జట్టులో తాంజిద్ హసన్, సౌమ్య సర్కార్‌తో కెప్టెన్ నజ్ముల్ హుసేన్ షాంటో కూడా లెఫ్టాండర్ బ్యాటర్లేనన్న విషయం తెలిసిందే.
ఇక చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌కు ఎంపిక చేసిన జట్టులో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఐదుగురు స్పిన్నర్లకు చోటిచ్చింది. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్(ఇద్దరూ లెఫ్టార్మ్ స్పిన్నర్లే), వాషింగ్టన్ సుందర్(రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్)లతో పాటు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్), మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(రైటార్మ్ లెగ్ బ్రేక్)లను ఎంపిక చేసింది.
చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.
చదవండి: CT 2025: అదొక చెత్త నిర్ణయం.. అతడి వల్లే ఇదంతా: మాజీ క్రికెటర్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment