బ్యాటింగ్ లో భజ్జీ మెరుపులు | Ranji Trophy: Harbhajan Singh rescues Punjab after early collapse against Jammu and Kashmir on Day 1 | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్ లో భజ్జీ మెరుపులు

Published Thu, Jan 9 2014 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM

జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన హర్భజన్ సింగ్ రంజీ ట్రోఫీలో పంజాబ్‌ను ముందుండి నడిపించాడు.

జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన హర్భజన్ సింగ్ రంజీ ట్రోఫీలో పంజాబ్‌ను ముందుండి నడిపించాడు.

వడోదర: జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన హర్భజన్ సింగ్ రంజీ ట్రోఫీలో పంజాబ్‌ను ముందుండి నడిపించాడు. అయితే అది బంతితో కాదు... బ్యాట్స్‌మన్‌గా సత్తా చాటుతూ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా జమ్మూ కాశ్మీర్‌తో బుధవారం ఇక్కడ ప్రారంభమైన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 304 పరుగులకు ఆలౌటైంది. హర్భజన్ సింగ్ (79 బంతుల్లో 92; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) అద్భుత బ్యాటింగ్‌తో ఆదుకోవడంతో పంజాబ్ ఇన్నింగ్స్ నిలబడింది.

కాశ్మీర్ బౌలర్లు ఉమర్ నజీర్ (4/66), రామ్ దయాళ్ (3/59) చెలరేగడంతో పంజాబ్ 146 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో హర్భజన్, సందీప్ శర్మ (123 బంతుల్లో 51; 8 ఫోర్లు) కలిసి ఎనిమిదో వికెట్‌కు 105 పరుగులు జోడించారు. ముఖ్యంగా పర్వేజ్ రసూల్‌పై భజ్జీ సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. రసూల్ బౌలింగ్‌లోనే 5 సిక్సర్లు కొట్టిన పంజాబ్ కెప్టెన్, చివరకు అతనికే వికెట్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన జమ్మూ కాశ్మీర్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 11 పరుగులు చేసింది.
 ఉతప్ప, కరుణ్ నాయర్ సెంచరీలు
 బెంగళూరు: ఉత్తరప్రదేశ్‌తో ప్రారంభమైన మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి కర్ణాటక తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. రాబిన్ ఉతప్ప (160 బంతుల్లో 100; 19 ఫోర్లు), కరుణ్ నాయర్ (246 బంతుల్లో 100; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలు చేయడం విశేషం. రాహుల్ (0), సమర్థ్ (0), మనీశ్ పాండే (0) వరుసగా వెనుదిరగడంతో కర్ణాటక స్కోరు 15/3 వద్ద నిలిచింది. ఈ దశలో ఉతప్ప, నాయర్ నాలుగో వికెట్‌కు 120 పరుగులు జోడించి ఆదుకున్నారు. గౌతమ్ (101 బంతుల్లో 89 బ్యాటింగ్; 14 ఫోర్లు) సెంచరీకి చేరువలో ఉన్నాడు.  
 సూర్యకుమార్ శతకం
 ముంబై: వాంఖడే మైదానంలో మహారాష్ట్రతో జరుగుతున్న మరో మ్యాచ్‌లో ఆట ముగిసే సమయానికి  ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లకు 306 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్ (139 బంతుల్లో 120; 18 ఫోర్లు), వినీత్ ఇందూల్కర్ (164 బంతుల్లో 82; 13 ఫోర్లు) ఐదో వికెట్‌కు 183 పరుగులు జోడించడం విశేషం. వసీం జాఫర్ (44) ఫర్వాలేదనిపించాడు. మహారాష్ట్ర బౌలర్లలో సంక్లేచా, ఫలా చెరో 3 వికెట్లు పడగొట్టారు.
 సుదీప్ ఛటర్జీ సెంచరీ మిస్
 కోల్‌కతా: రైల్వేస్‌తో ప్రారంభమైన క్వార్టర్స్ మ్యాచ్‌లో ఆట ముగిసే సరికి బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. సుదీప్ ఛటర్జీ (176 బంతుల్లో 96; 14 ఫోర్లు) కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈశ్వరన్ (65), సాహా (60 బ్యాటింగ్) రాణించారు. రైల్వేస్ బౌలర్ అనురీత్ సింగ్ (4/75) ఆకట్టుకున్నాడు.

   మళ్లీ అదే సీన్!
 లీగ్ దశలో బెంగాల్, రైల్వేస్ జట్ల మధ్య ‘మన్కడింగ్’తో ఏర్పడిన వివాదం చల్లబడినట్లు లేదు. ఇరు జట్ల మధ్య క్వార్టర్ ఫైనల్లో కూడా మళ్లీ మరోసారి మాటల యుద్ధం జరిగింది. ఈసారి కూడా రైల్వేస్ కెప్టెన్ మురళీ కార్తీక్ ఇందులో భాగమయ్యాడు. బెంగాల్ ఆటగాడు అశోక్ దిండా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కార్తీక్ అతని ఆట గురించి ఏదో వ్యాఖ్య చేసినట్లు తెలిసింది. అయితే 12 బంతుల్లో 4 ఫోర్లతో 17 పరుగులు చేసిన దిండా, ఆట ముగిశాక డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళుతూ తన బ్యాట్‌ను రైల్వేస్ టీమ్ వైపు చూపిస్తూ  సైగలు చేశాడు. ‘కార్తీక్ మాటలకే దిండా స్పందించాడు. తగిన విధంగా జవాబు ఇవ్వడం దిండాకు బాగా తెలుసు’ అని బెంగాల్  జట్టు సభ్యుడొకరు వెల్లడించారు. అంతకు ముందు కార్తీక్ బౌలింగ్‌లో కీపర్ రావత్ స్టంపింగ్ మిస్ చేయడంతో బెంగాల్ కెప్టెన్ శుక్లా బతికిపోయాడు. ఈ సందర్భంలో కూడా మాటల దాడికి దిగారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement