
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక‍్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించింది. ఇరు జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పైచేయి సాధించింది. సన్‌రైజర్స్ 174 పరుగుల స్కోరును కాపాడుకుని కోల్‌కతాకు సొంతమైదానంలో షాకిచ్చింది. సన్‌రైజర్స్ విజయంలో రషీద్ ఖాన్ మూడు వికెట్లతో కీలక పాత్ర పోషించగా, అతనికి జతగా సిద్ధార్థ్ కౌల్, బ్రాత్‌వైట్‌లు తలో రెండు వికెట్లతో సహకరించాడు. ఆదివారం సీఎస్‌కేతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అమీతుమీ పోరులో తలపడనుంది.
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కతా దూకుడుగా బ్యాటింగ్ ఆరంభించింది. క్రిస్ లిన్(48; 31 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్సర్లు), నరైన్(26; 13 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగి ఆడారు. ఆపై నితీష్ రాణా(22; 16 బంతుల్లో 1 ఫోర్, 2సిక్సర్లు), శుభ్‌మాన్ గిల్(30; 20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక‍్సర్) మినహా ఎవరూ ఆడలేదు. దాంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల కోల్పోయి 161 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సన్‌రైజర్స్ ఆటగాళ్లలో ధావన్(34; 24 బంతుల్లో 4 ఫోర్లు,1 సిక‍్సర్), వృద్ధిమాన్ సాహా(35; 27 బంతుల్లో 5 ఫోర్లు), షకిబుల్ హసన్(28; 24 బంతుల్లో 4 ఫోర్లు)లు ఫర్వాలేదనిపించగా, చివర్లో రషీద్ ఖాన్(34 నాటౌట్;10 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో సన్‌రైజర్స్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన సన్‌రైజర్స్ 56 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్ మొదటి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆపై వెంటనే కేన్ విలియమ్సన్(3) సైతం ఔట్ కావడంతో సన్‌రైజర్స్ 60 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో దీపక్ హుడాతో షకిబుల్ హసన్ జట్టు పరిస్థితిని చక్కదిద్దాడు. జట్టు స్కోరు 113 పరుగుల వద్ద షకిబుల్ రనౌట్‌గా నిష్క్రమించాడు. ఆపై బ్రాత్‌వైట్(8), యూసఫ్ పఠాన్(3)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు. దాంతో సన్‌రైజర్స్ స్కోరు 150 పరుగులు చేయడమే కష్టంగా అనిపించింది. కాగా, రషీద్ ఖాన్ దూకుడుగా ఆడి జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. రషీద్ బౌండరీలే లక్ష్యంగా చెలరేగడంతో సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు 174 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీయగా, నరైన్, పీయూష్ చావ్లా, శివం మావిలు తలో వికెట్ తీశారు.