న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రిని తిరిగి కొనసాగించనున్నారా అంటే తాజా పరిణామాలను బట్టి అవుననే అనిపిస్తోంది. ఎంతో ఆర్భాటంగా కోచ్ పదవుల కోసం దరఖాస్తులను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఆహ్వానించినా, మరోసారి రవిశాస్త్రి వైపే మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. రవిశాస్త్రి పర్యవేక్షణలో టీమిండియా ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించిందనే భావనలో కోచ్ ఎంపిక కోసం నియమించిన క్రికెట్ సలహా కమిటీ(సీఏసీ) ఉండటం ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. కోచ్ ఎంపికలో భాగంగా దరఖాస్తుల గడువు ఈ నెల చివరి వరకూ ఉన్నప్పటికీ, తాజాగా సీఏసీలో సభ్యుడైన అన్షుమన్ గైక్వాడ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రవిశాస్త్రి బాగా పని చేశాడని అన్షుమన్ గైక్వాడ్ కితాబు ఇవ్వడంతో అతనికే మరోసారి కోచ్ పగ్గాలు అప్పచెబుతారా అనేది అభిమానులకు ప్రశ్నగా మారిపోయింది.
‘రవిశాస్త్రిని హెడ్ కోచ్‌గా నియమించిన తర్వాత టీమిండియా సాధించిన ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయి. ఇది మనం కచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయం. రవిశాస్త్రి తన పనిని సమర్థవంతంగానే నిర్వర్తించాడు’ అని గ్వైక్వాడ్ పేర్కొన్నాడు. కాగా, కోచింగ్, సపోర్టింగ్ స్టాఫ్ ఎంపిక అనేది బీసీసీఐ నియమావళి ప్రకారమే ఉంటుందని ముక్తాయింపు ఇచ్చాడు. మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆధ్వర్యంలోని క్రికెట్ సలహా కమిటీ.. టీమిండియా ప్రధాన కోచ్‌తో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌లను ఎంపిక చేయనుంది. ఈ కమిటీలో కపిల్, అన్షుమన్ గైక్వాడ్‌లతో పాటు మహిళా జట్టు మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి సభ్యురాలిగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment