
ముంబై: టీమిండియా ఆటగాళ్లు ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లిల మధ్య కమిట్‌మెంట్ చాలా గొప్పగా ఉంటుందని హెడ్‌కోచ్ రవిశాస్త్రి అన్నాడు. ప్రపంచకప్‌లో ధోని అనుభవం కోహ్లి దూకుడు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. మంగళవారం ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రపంచకప్ సన్నద్దత, టీమిండియా ప్రణాళికల గురించి వివరించాడు. ‘ధోని, కోహ్లి సారథ్యాలలో కోచ్‌గా పనిచేయడం అద్భుతం. వారిద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటారు. ఆటపై, ప్రణాళికల గురించి చర్చించుకోవడం నేను చూశాను. ఇద్దరూ లెజెంట్ ఆటగాళ్లు. ఆటపై వారికున్న అంకితభావానికి నేనే చాలాసార్లు ఫిదా అయ్యాను. ఇద్దరి మధ్య కమిట్‌మెంట్ చాలా గొప్పగా ఉంటుంది.’అంటూ శాస్త్రి చెప్పుకొచ్చాడు.
ప్రపంచకప్‌లో టీమిండియా..
మనకు అద్భుతమైన జట్టు ఉంది. అంతేకాదు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగల క్రికెటర్లు భారత జట్టులో ఉన్నారు. అంతేకాదు నెంబర్. 4 స్థానంలో ఆడగల బ్యాట్స్‌మెన్ సైతం ఉన్నారు. ప్రస్తుతం దాని గురించే అస్సలు ఆలోచించడం లేదు. వరల్డ్‌కప్ లాంటి మెగాటోర్నీలో ఏ జట్టూ ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోదు. పరిస్థితులను బట్టి ఆడాల్సి ఉంటుంది. నాలుగేళ్లలో ఇలాంటి పరిస్థితులెన్నో చూశాం. ఒత్తిడిని అధిగమించాం. వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా, వెస్టిండిస్ జట్లు ఏమైనా చేయగలవు. భారత్‌లో ఆడినప్పుడు వెస్టిండిస్ జట్టు గట్టి పోటీనిచ్చింది’ అని శాస్త్రి పేర్కొన్నాడు.