
మా శైలిని మార్చుకోం
- ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు
- జట్టుకు రవిశాస్త్రి మద్దతు
కొలంబో: భారత జట్టు అనవసరపు ఒత్తిడికి లోను కావడం వల్లే తొలి టెస్టులో పరాజయం పాలైందని, ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు మున్ముందు అదే జోరు కొనసాగుతుందని భారత క్రికెట్ జట్టు డెరైక్టర్ రవిశాస్త్రి వ్యాఖ్యానించారు. అయితే తొలి టెస్టు తరహాలోనే తాము ఆడతామని, ఒక్క ఓటమితో శైలి మార్చుకోమని ఆయన స్పష్టం చేశారు. ‘మా ఆటతీరును మార్చుకోం. తొలి టెస్టులో ఎలా ఆడామో ఇకపై కూడా అలాగే ఆడతాం. విజయానికి చేరువైనా ఒక్క పొరపాటుతో పరిస్థితి మారింది. పిచ్ మారుతుందని మాకూ తెలుసు. కానీ ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు’ అని శాస్త్రి విశ్లేషించారు.
జట్టులో ప్రతిభకు కొదవ లేదని, ఇకపై కూడా వారు దూకుడుగానే ఆడతారన్న శాస్త్రి... కెప్టెన్‌గా విరాట్ కోహ్లి ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడన్నారు. గాలే టెస్టులో చివరి రోజు మరీ ఆత్మరక్షణ ధోరణిలో కాకుండా ఎదురు దాడి చేసి ఉంటే బాగుండేదని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. ‘నా ఉద్దేశం సిక్సర్లు, ఫోర్లు బాదాలని కాదు. కానీ విరామం ఇవ్వకుండా చకచకా పరుగులు తీయాల్సింది. బ్యాట్స్‌మెన్ అతి జాగ్రత్తకు పోయినట్లు నాకనిపించింది. ఏదీ ఎక్కువ కాకుండా తెలివైన క్రికెట్ ఆడాలి. ఈ మార్పు ఇకపై కనిపిస్తుందని ఆశిస్తున్నా’ అని డెరైక్టర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇద్దరు ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన వల్లే శ్రీలంక నెగ్గిందని, వారు మరీ ఉత్సాహపడాల్సిన విషయం ఏమీ కాదని పరోక్షంగా లంకను విమర్శించిన రవిశాస్త్రి... పరిస్థితులను బట్టే స్టువర్ట్ బిన్నీని తుది జట్టులో ఎంపిక చేయడంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
బ్రాడ్‌మన్‌తో సమానుడు...
అంతర్జాతీయ క్రికెట్‌కు మరో వారం రోజుల్లో వీడ్కో లు పలకనున్న శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కరకు టీమిండియా ప్రత్యేక అభినందనలు తెలిపింది. భారత్, లంక మధ్య గురువారం నుంచి ఇక్కడ జరిగే రెండో టెస్టు అనంతరం సంగక్కర రిటైర్ కానున్నాడు. ఈ సందర్భంగా భారత టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి అతడిని ప్రశంసిస్తూ సంగను సచిన్ టెండూల్కర్‌తో పోల్చారు. ‘ఒక్కసారి ప్రపంచ క్రికెట్‌లో టాప్-3 స్థాయికి చేరుకున్నాక దానిని సుదీర్ఘ కాలం కొనసాగించడం అంత సులువు కాదు. సచిన్‌లాంటి కొంత మందికే అది సాధ్యమైంది. సంగక్కర అదే కోవకు చెందినవాడు. అగ్రస్థానానికి వెళ్లిన తర్వాత ఆ స్థాయికి తగ్గని రీతిలో అతను ఆడాడు. ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్లా పరుగుల చేసిన సంగకు డబుల్ సెంచరీలు మంచినీళ్లప్రాయం. అతను బ్రాడ్‌మన్‌తో సమానం’ అని శాస్త్రి అభిప్రాయపడ్డారు. సంగక్కర భారత్‌కు ఆడి ఉంటే అతనికి ఇంకా ఎక్కువ గుర్తింపు దక్కి ఉండేదని ఆయన అన్నారు.