ఇండోర్: గతంలో సౌరవ్ గంగూలీ, రవిశాస్త్రిల మధ్య జరిగిన రగడను ఏ ఒక్క క్రికెట్ ఫ్యాన్స్ మరచిపోయి ఉండడు. అనిల్ కుంబ్లేకు టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు అప్పచెప్పిన సమయంలో గంగూలీపై రవిశాస్త్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. తన కోచ్ పదవిని అప్పటి క్రికెట్ అడ్వైజరీ కమిటీలోని సభ్యుడు గంగూలీనే అడ్డుకున్నాడంటూ రవిశాస్త్రి ధ్వజమెత్తాడు. అందుకు గంగూలీ కూడా ధీటుగానే బదులిచ్చాడు. తానేమే కోచ్ పదవిని అడ్డుకోలేదని, అందుకు అనిల్ కుంబ్లే సమర్ధుడనే అతనికి బాధ్యతలు అప్పచెప్పామంటూ రవిశాస్త్రి వ్యాఖ్యలను తిప్పికొట్టాడు.
కాలం మారింది.. రవిశాస్త్రి మళ్లీ ప్రధాన్ కోచ్ కాగా, గంగూలీ ఏకంగా బీసీసీఐకే బాస్‌గా వచ్చేశాడు. ఇప్పుడు రవిశాస్త్రి చేసే ప్రతి పనినీ గంగూలీ తీవ్రంగా పరిశీలిస్తాడనంలో ఎటువంటి సందేహం లేదు. అదే భయం రవిశాస్త్రిలో కనిపిస్తున్నట్లు ఉంది. ఎప్పుడూ భారత క్రికెటర్లకు కేవలం సూచనలు ఇస్తూ మాత్రమే కాలం గడిపేసే రవిశాస్త్రి.. తాజాగా బౌలింగ్ చేస్తూ కనిపించాడు.
క్రికెటర్లు నెట్స్ లో ప్రాక్టీస్ చేసే సమయంలో వారికి బౌలింగ్ మరీ చేశాడు. ఈ ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రవిశాస్త్రి, అందుకు ‘ఓల్డ్ హాబిట్స్ డై హార్డ్’ అనే క్యాప్షన్ ఇచ్చాడు. దాంతో నెటిజన్లు మరొకసారి రవిశాస్త్రిని ఆడేసుకుంటున్నారు. ‘ఓల్డ్ హాబిట్స్ డై హార్డ్’ ఏమీ కాదు.. నువ్వు గంగూలీని చూసి భయపడుతున్నావ్. అందుకే ఎప్పుడూ బద్ధకంగా ఉండే నువ్వు బౌలింగ్ చేస్తున్నావ్’ అని ఒకరు విమర్శించగా, ‘బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఎంపికైన తర్వాత వచ్చిన ప్రధాన మార్పు ఏమైనా ఉంటే ఇదే’ అని మరొకరు సెటైర్ వేశారు. ‘ ఎప్పుడూ చేతిలో అల్కాహల్ బాటిల్‌తో ఉండే రవిశాస్త్రిలో ఎంత మార్పు’ అని మరొక అభిమాని ఎద్దేవా చేశాడు. ‘ నీ చేతిలో బంతి బాలేదు బాస్.. బీర్ బాటిల్ ఉంటే బాగుంటుంది’ అని బంతి స్థానంలో బీర్ తాగుతున్న ఫోటోను ఎడిట్ చేసి మరీ మరొకరు ట్రోల్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment