అయ్యో..నేను చూడలేదే!
నాగ్పూర్:ఇటీవల కాలంలో ట్విట్టర్లో తనపై వస్తున్న విమర్శలపై భారత క్రికెటర్ రవి చంద్రన్ అదే తరహాలో దీటుగా బదులిస్తున్నాడు. అయితే అశ్విన్ తాజాగా చేసిన ట్వీట్ పై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మరికొంతమంది సమర్ధిస్తున్నారు. మూడు ట్వంటీ 20ల్లో భాగంగా కాన్పూర్లో జరిగిన తొలి మ్యాచ్ అనంతరం అశ్విన్ పై సెటైర్లు గుప్పించారు నెటిజన్లు. ప్రధానంగా తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ 20 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో మొయిన్ అలీని ఆకాశానికి ఎత్తేసిన నెటిజన్లు.. అశ్విన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు.
ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న అశ్విన్.. మొయిన్ అలీ నుంచి స్పిన్ పాఠాలు నేర్చుకుంటే బాగుంటుందంటూ చమత్కరించారు. అందుకు కారణం ఇంగ్లండ్ తో మూడు వన్డేల సిరీస్ లో అశ్విన్ కేవలం మూడు వికెట్లను మాత్రమే తీయడం. టెస్టుల్లో చెలరేగిపోయే అశ్విన్.. వన్డేల్లో పేలవ ప్రదర్శన చేయడాన్ని కొంతమంది నెటిజన్లు ఇక్కడ ప్రస్తావించారు. ఈ క్రమంలోనే మొయిన్ అలీ నుంచి కొన్ని సలహాలు తీసుకుంటే బాగుంటందంటూ సలహా కూడా ఇచ్చేశారు. దీనికి అశ్విన్ వెటకారంగా సమాధానమిచ్చాడు. మొయిన్ అలీ నుంచి నేర్చుకోవడానికి అతను ఆ రోజు వేసిన స్పెల్ను తాను చూడలేదంటూ ట్వీట్ చేశాడు. అతని స్పెల్ పూర్తయిన తరువాత మాత్రమే టీవీ పెట్టుకున్నానంటూ అశ్విన్ ట్వీట్ ద్వారా ఘాటుగా సమాధానమిచ్చాడు.
ఇలా అశ్విన్ నుంచి ఊహించని సమాధానం రావడంతో అతనికి సలహా ఇచ్చిన వారు తీవ్ర స్థాయిలో మండిపడుతుండగా, అతని అభిమానులు మాత్రం సమాధానం అదిరిపోయిందంటూ అశ్విన్ కు మద్దతుగా నిలిచారు. భారత్ కు ఎన్నో విజయాలు అందించిన ఓ వ్యక్తిని ఇలా విమర్శంచడం ఎంతవరకూ సమంజసమని అశ్విన్ కు అండగా నిలిచారు.