
న్యూఢిల్లీ:భారత క్రికెట్ జట్టులో ఉన్న స్పిన్నర్ల విషయానికొస్తే రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో కీపింగ్ చేయడం చాలా కష్టమని అంటున్నాడు రెగ్యులర్ టెస్టు వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా. అశ్విన్ సంధించే బంతుల్లో చాలా ఎక్కువ వైవిధ్యం ఉన్న కారణంగానే కీపింగ్ చేయడం కష్టతరంగా ఉంటుందన్నాడు. ఇక్కడ మిగతా స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ల కంటే అశ్విన్ బౌలింగ్ లో కీపింగ్ చేయడం అంత సులువు కాదన్నాడు.
'ప్రస్తుత భారత జట్టు స్సిన్నర్లలో అశ్వినే ముందు వరుసలో ఉన్నాడు. అశ్విన్ బౌలింగ్ శైలి భిన్నంగా ఉంటుంది. అతను అనేక కోణాల్లో బౌలింగ్ చేస్తూ ఉంటాడు. బౌలింగ్ లెంగ్త్ లో ఒక ప్రత్యేకత ఉంది. అదే అశ్విన్ ను ఉన్నతస్థాయిలో నిలిపింది. ఇక్కడ కుల్దీప్, జడేజాల కంటే అశ్విన్ బౌలింగ్ లోనే వైవిధ్యం ఎక్కువని చెప్పాలి. దాంతో అశ్విన్ బౌలింగ్ కు కీపింగ్ చేయడం సవాల్ గా ఉంటుంది. ఇక ఫాస్ట్ బౌలింగ్ విషయానికొస్తే మొహ్మద్ షమీ, ఇషాంత్ శర్మల యాక్షన్ ఫోజు అతి పెద్ద ఛాలెంజ్ గా సాహా అభివర్ణించాడు. ఇక్కడ ఆ ఇద్దరి స్వింగ్ బౌలింగ్ కంటే వారి యాక్షనే సవాల్ గా ఉంటుంది'అని సాహా తెలిపాడు. ఒక కీపర్ గా వికెట్ల వెనుక కీపింగ్ చేసేటప్పుడు ఎవరు బౌలింగ్ కఠినంగా అనిపిస్తుంది అనే దానిపై సాహా పైవిధంగా స్పందించాడు. గురువారం నుంచి శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో వికెట్ కీపర్ గా తన అభిప్రాయాలను సాహా పంచుకున్నాడు.