ఆ స్థానాన్ని భర్తీ చేసే వారి కోసం వెతుకులాట
ముందు వరుసలో వాషింగ్టన్ సుందర్
గింగిరాలు తిరిగే బంతులతో... ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టిన స్టార్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకగా... భారత జట్టులో అతడి స్థానాన్ని భర్తీ చేసేవారెవరు అనే చర్చ జోరుగా సాగుతోంది. విదేశీ పిచ్‌లపై ప్రదర్శనను పక్కన పెడితే... స్వదేశంలో టీమిండియా జైత్రయాత్ర వెనక అశ్విన్ పాత్ర ఎంతో ఉందనేది కాదనలేని సత్యం.
అశ్విన్ అరంగేట్రం చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు సొంతగడ్డపై టీమిండియా 65 టెస్టులు ఆడగా... వీటన్నింటిలో అశ్విన్ బరిలోకి దిగాడు. ఈ మధ్య కాలంలో అశ్విన్ విఫలమైన రెండు సిరీస్‌లలో (2012 ఇంగ్లండ్‌తో, 2024 న్యూజిలాండ్‌తో) తప్ప అన్నీట్లో టీమిండియా జయకేతనం ఎగరవేసింది.
ఈ గణాంకాలు చాలు అతడేంటో చెప్పేందుకు. 106 టెస్టుల్లో 537 వికెట్లు పడగొట్టి... భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచిన 38 ఏళ్ల అశ్విన్... ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ మూడో టెస్టు అనంతరం బుధవారం అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకగా... సహచరులు, సీనియర్లు అశ్విన్ ఘనతలను కొనియాడారు.
అయితే ఇకపై అశ్విన్ సేవలు అందుబాటులో లేకపోవడంతో... స్పిన్ మాంత్రికుడి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరనే చర్చ ప్రధానంగా సాగుతోంది. ఇందులో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, తనుశ్ కొటియాన్, అక్షర్ పటేల్ పేర్లు గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో వారి ప్రదర్శనలను ఓసారి పరిశీలిస్తే... –సాక్షి క్రీడావిభాగం
సుందర్‌కే చాన్స్ ఎక్కువ...
ఇప్పుడున్న పరిస్థితుల్లో అశ్విన్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరా అనే ప్రశ్నకు వాషింగ్టన్ సుందర్ అనే సమాధానమే వినిపిస్తోంది. ఈ ఇద్దరూ తమిళనాడుకు చెందిన వాళ్లే కాగా... సుందర్ కూడా అశ్విన్ బాటలోనే అటు బంతితో మాయ చేయడంతో పాటు ఇటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటగల సమర్థుడు. తాజా ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ తొలి టెస్టులో అశ్విన్‌ను కాదని టీమ్ మేనేజ్‌మెంట్ సుందర్‌కే అవకాశమిచ్చింది.
సమీప భవిష్యత్తులో ఇలాగే జరిగే సూచనలు కనిపించడంతోనే అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్... కొత్త తరానికి మార్గం సుగమం చేశాడు. అశ్విన్ తరహాలోనే టి20 ఫార్మాట్‌లో సత్తాచాటి అటు నుంచి జాతీయ జట్టు తలుపు తట్టిన 25 ఏళ్ల సుందర్... ఇప్పటి వరకు టీమిండియా తరఫున 7 టెస్టులు ఆడి 24 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో 48.37 సగటుతో 387 పరుగులు సాధించాడు.
విదేశీ పిచ్‌లపై అశ్విన్ కంటే మెరుగైన బ్యాటింగ్ నైపుణ్యం సుందర్ సొంతం కాగా... ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జట్టు యాజమాన్యం సుందర్‌ను ప్రోత్సహిస్తోంది. కెపె్టన్, కోచ్ నమ్మకాన్ని సంపాదించిన సుందర్... ఎప్పటికప్పుడు బౌలింగ్‌లో వైవిధ్యం చూపగల నేర్పరి కావడంతో అతడు ఈ జాబితాలో ముందు వరుసలో కనిపిస్తున్నాడు.
రేసులో కుల్దీప్ యాదవ్
ఒకదశలో విదేశాల్లో భారత ప్రధాన స్పిన్నర్ అని హెడ్ కోచ్‌తో మన్ననలు అందుకున్న మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆ తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. చైనామన్ స్పిన్నర్‌గా జట్టులోకి వచి్చన కుల్దీప్ ప్రధానంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లోనే ఆకట్టుకున్నాడు.
ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున 106 వన్డేల్లో 172 వికెట్లు... 40 టి20ల్లో 69 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో టెస్టు ఫార్మాట్‌లో 13 మ్యాచ్‌లాడిన 30 ఏళ్ల కుల్దీప్ యాదవ్ 22.16 సగటుతో 56 వికెట్లు పడగొట్టాడు. అయితే ప్రస్తుతం అశ్విన్ స్థానం కోసం పోటీపడుతున్న వారిలో బ్యాటింగ్ పరంగా కుల్దీప్ యాదవ్ కాస్త వెనుకబడి ఉండటం అతడికి ప్రతిబంధకంగా మారింది.
ఆంధ్ర ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి పేస్ ఆల్‌రౌండర్‌గా టెస్టు జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవడం ఖాయంగానే కనిపిస్తున్న నేపథ్యంలో కుల్దీప్‌కు బ్యాటింగ్ ప్రతిభతో సంబంధం లేకుండా స్వదేశీ పిచ్‌లపై ప్రధాన స్పిన్నర్‌గా ఎంపిక చేసుకునే అవకాశాలు లేకపోలేదు. వయసురీత్యా చూసుకుంటూ ఇప్పటికే 30వ పడిలో ఉన్న కుల్దీప్... అశ్విన్ వారసుడిగా పేరు తెచ్చుకుంటాడా అనేది కాలమే నిర్ణయించాలి.
అక్షర్‌కు అవకాశం లేనట్టే!
గత కొంతకాలంగా పరిశీలిస్తే... సొంతగడ్డపై భారత జట్టు ఆడిన టెస్టుల్లో అక్షర్ పటేల్ మూడో స్పిన్నర్‌గా బరిలోకి దిగాడు. తన ఎత్తును వినియోగించుకుంటూ ఎడమ చేత్తో బంతిని స్పిన్ చేయడంతో పాటు బ్యాటింగ్‌లోనూ ప్రభావం చూపాడు. 30 ఏళ్ల అక్షర్ ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున 14 టెస్టులు ఆడి 19.34 సగటుతో 55 వికెట్లు పడగొట్టడంతో పాటు 35.88 సగటుతో 646 పరుగులు చేశాడు.
పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోనూ స్పిన్ ఆల్‌రౌండర్‌గా తనదైన పాత్ర పోషిస్తున్న అక్షర్ పటేల్‌కు తన బౌలింగ్ శైలే ప్రధాన సమస్యగా మారింది. ప్రస్తుతం టీమిండియాలో సీనియర్ స్పిన్నర్‌గా ఉన్న రవీంద్ర జడేజా కూడా ఎడమచేతి వాటం బౌలరే కాగా... అక్షర్ మాదిరే బ్యాటింగ్‌లోనూ సత్తా చాటగల సమర్థుడు. దీంతో బౌలింగ్‌లో వైవిధ్యం ఉండాలి అంటే వీరిద్దరిలో ఒక్కరినే ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తనుశ్‌పై దృష్టి...
ముంబైకి చెందిన కుడిచేతి వాటం ఆఫ్‌స్పిన్నర్ తనుశ్ కొటియాన్‌కు కూడా అశ్విన్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశవాళీల్లో అపార అనుభవం ఉన్నా... ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేయని 26 ఏళ్ల తనుశ్... ఇటీవల ఆ్రస్టేలియా పర్యటనలో భాగంగా భారత్ ‘ఎ’ జట్టు తరఫున ఆకట్టుకున్నాడు.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 33 మ్యాచ్‌లు ఆడి 25.70 సగటుతో 101 వికెట్లు పడగొట్టిన కొటియాన్... బ్యాట్‌తో 41.21 సగటుతో 1525 పరుగులు సాధించాడు. బౌలింగ్‌లో చక్కటి ప్రతిభతో పాటు అవసరమైతే లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న తనుశ్... జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటే సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశాలున్నాయి. అయితే ప్రస్తుతానికి టీమిండియాలో ఉన్న పోటీని తట్టుకోవడం అంత సులభం అయితే కాదు.
Comments
Please login to add a commentAdd a comment