కటక్: వెస్టిండీస్‌తో చివరి వన్డేలో కీలక ఇన్నింగ్స్ ఆడిన రవీంద్ర జడేజా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. కొన్నాళ్ల క్రితం వరకు జడేజా టెస్టులకే పరిమితమయ్యాడు. అయితే పునరాగమనంలో లభించిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్న అతను ఇప్పుడు వన్డేల్లోనూ ప్రధాన ఆటగాడిగా మారాడు. మూడో వన్డేలో జడేజా 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. కటక్ ప్రదర్శనపై అతను మాట్లాడుతూ... ‘నేనేమిటో ప్రపంచానికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఏం ఆడగలనో నాకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. ఇంకా పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ సత్తా చాటగలనని ఈ మ్యాచ్‌తో చూపించాను.
ఈ ఏడాది నేను ఎక్కువగా వన్డేలు ఆడలేదు. అయితే కీలక దశలో సిరీస్ విజయానికి అవసరమైన రీతిలో నా అత్యుత్తమ ఆటతీరు కనబర్చేందుకు ప్రయత్నించాను’ అని వ్యాఖ్యానించాడు. టీమిండియా ఈ ఏడాది 28 వన్డేలు ఆడగా అందులో 15 మ్యాచ్‌లలో జడేజా ఉన్నాడు. మరోవైపు జడేజా ప్రదర్శన పట్ల బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా సంతృప్తి వ్యక్తం చేశాడు. జడేజా బ్యాటింగ్ ఎంతో మెరుగుపడటం సానుకూలాంశమని అతను అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment