ఇండోర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఇక్కడ కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కింగ్స్ పంజాబ్ నిర్దేశించిన 89 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ 8.1 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఛేదించింది. ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లి(48 నాటౌట్;28 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక‍్సర్లు), పార్థీవ్ పటేల్(40నాటౌట్; 22 బంతుల్లో 7 ఫోర్లు) వికెట్ పడకుండా జట్టుకు విజయాన్ని అందించారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కింగ్స్ పంజాబ్ 15.1 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. ఏ దశలోనూ ఆర్సీబీ బౌలింగ్‌ను నిలువరించలేక పేకమేడలా కూలింది. ఆర్సీబీ పేసర్ ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు సాధించి కింగ్స్ పంజాబ్‌ను దెబ్బ తీశాడు. అతనికి జతగా సిరాజ్, చాహల్, గ్రాండ్ హోమ్, మొయిన్ అలీ తలో వికెట్ తీశారు.
కింగ్స్ ఆటగాళ్లు రాహుల్ మూడు సిక్సర్లు, గేల్ నాలుగు ఫోర్లతో దూకుడుగా కనిపించగా వారిని ఉమేశ్ యాదవ్ బోల్తా కొట్టించాడు. ఒకే ఓవర్‌లో రాహుల్(21), క్రిస్ గేల్(18)లు నిష్క్రమించడంతో ఇక కింగ్స్ పంజాబ్ పతనం ప్రారంభమైంది. కాగా, అరోన్ ఫించ్(26) ఫర్వాలేదనిపించడంతో కింగ్స్ తేరుకున్నట్లు కనబడింది. అయితే ఫించ్ ఔటైన తర్వాత కింగ్స్ స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఎనిమిది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో కింగ్స్ పంజాబ్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది.
Comments
Please login to add a commentAdd a comment