ఇండోర్: ఇండియన్ ప‍్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ పవర్ ప్లే ముగిసేలోపే మూడు కీలక వికెట్లను నష్టపోయింది. కేఎల్ రాహుల్(21), క్రిస్ గేల్(18), కరుణ్ నాయర్(1)ల వికెట్లను కింగ్స్ పంజాబ్ కోల్పోయి కష్టాల్లో పడింది. ఆర్సీబీ బౌలర్ ఉమేశ్ యాదవ్ వేసిన ఐదో ఓవర్‌లో రాహుల్, గేల్‌లు పెవిలియన్ చేరగా, ఆపై సిరాజ్ వేసిన ఆరో ఓవర్ రెండో బంతికి నాయర్ ఔటయ్యాడు. దాంతో కింగ్స్ పంజాబ్ 41 పరుగుల వద్ద మూడో వికెట్‌ను నష్టపోయింది. కింగ్స్ పంజాబ్ 36 పరుగుల వద్ద రాహుల్ వికెట్‌ను కోల్పోగా, 41 పరుగుల వద్ద గేల్, నాయర్ వికెట్లను కోల్పోయింది. ఐదు పరుగుల వ్యవధిలో కింగ్స్ పంజాబ్ మూడు వికెట్లను సమర్పించుకోవడంతో ఒక్కసారిగా ఇబ్బందుల్లో పడింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత ఫీల్డింగ్ తీసుకుంది. దాంతో కింగ్స్ పంజాబ్ బ్యాటింగ్‌ను రాహుల్, గేల్‌లు ఆరంభించారు. రాహుల్ మూడు సిక్సర్లు, గేల్ నాలుగు ఫోర్లతో దూకుడుగా కనిపించనప్పటికీ వారిని ఉమేశ్ యాదవ్ బోల్తా కొట్టించాడు. ఐదో ఓవర్ మూడో బంతికి రాహుల్ ఔట్ కాగా, అదే ఓవర్ చివరి బంతికి గేల్ పెవిలియన్ బాట పట్టాడు. వీరిద్దరూ భారీ షాట్లకు యత్నించి నిష్క్రమించారు. అటు తర్వాత చాహల్ బౌలింగ్‌లో స్టోయినిస్(2) నాల్గో వికెట్‌గా ఔట్ కావడంతో కింగ్స్ పంజాబ్ 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.
Comments
Please login to add a commentAdd a comment