మా పని అయిపోలేదు.. బంతిలా పైకిలేస్తాం: క్రికెటర్
ప్రస్తుత ఐపీఎల్ సిరీస్ లో అత్యంత చెత్త ప్రదర్శనతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ (ఆర్సీబీ) జట్టు అట్టడుగున మగ్గుతోంది. పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న ఆ జట్టుకు సెమిస్ అవకాశాలు దాదాపు లేనట్టే. కానీ ఆర్సీబీలోకి తాజాగా చేరిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్ క్రిస్ జోర్డాన్ మాత్రం ఇంకా తమకు పూర్తిగా ద్వారాలు మూసుకుపోలేదని, ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ ను తాము కచ్చితంగా గెలువాల్సి ఉందని చెప్తున్నాడు.
'ఇప్పటినుంచి మేం ప్రతి మ్యాచ్ ను కచ్చితంగా గెలువాలి. ఎక్కువగా ఆలోచించడం లేదు. శనివారం రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తో జరిగే మ్యాచ్ పైనే మేం ప్రధానంగా ఫోకస్ పెట్టాం' అని జోర్డన్ చెప్పాడు. ఆర్సీబీ ప్రదర్శన ఇప్పటివరకు అనుకున్నరీతిలో లేనప్పటికీ, ఇప్పటికీ ఐపీఎల్ లో తమ జట్టు పుంజుకునే అవకాశముందని, నేలకు కొట్టిన బంతిలా పైకిలేవడంపైనే తాము ఫోకస్ పెట్టామని జోర్డన్ తెలిపాడు. 'మేం గతాన్ని వదిలేసి.. తదుపరి మ్యాచ్ లో మంచి జరుగుతుందనే ఆలోచనతో ఉన్నాం. పుణెను మేం తప్పకుండా ఓడిస్తాం. ఈ విజయాన్ని కనుక సాధిస్తే.. ఆ స్ఫూర్తితో మరింత ముందుకెళ్లే అవకాశం ఉంటుంది' అని అన్నాడు. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ ల్లో ఆర్సీబీ ఐదింటిలో ఓడిపోయింది. అయినప్పటికీ ఇప్పటికీ తమ జట్టు చాలా దృఢంగా ఉందని, జట్టులో ఎంతోమంది అనుభవజ్ఞులైన క్రికెటర్లు ఉన్నారని, వారితో కలిసి ఆడేందుకు తాను ఎదురుచూస్తున్నానని జోర్డన్ చెప్పుకొచ్చాడు.