కోహ్లీకి భారీ జరిమానా
పుణె: విధ్వంసకరమైన బ్యాటింగ్ తో పొట్టి క్రికెట్ పోటీలో భారీగా పరుగులు సాధిస్తోన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్ సీబీ) బౌలింగ్ విభాగంలో బలహీనంగా ఉందన్న సంగతి తెలిసిందే. ఆ బలహీనతను అధిగమించే క్రమంలో కీలకమైన ఓవర్లను ఏ బౌలర్ తో వేయించాలా అని తెగ మథనపడిపోతున్నాడు ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ! అలా ఆ...లోచిస్తూ..చిస్తూ అతను కాలాన్నీ హరిస్తున్నాడు.
అయితే పుణే వేదికగా ధోనీ సారథ్యంలోని పుణే సూపర్ జెయింట్స్ తో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో మాత్రం ఆర్ సీబీ బౌలర్లు అద్భుతంగా రాణించారు. కానీ వ్యూహచర్చలతో టైమ్ ను కిల్ చేశారు. మ్యాచ్ చూసినవారెవరికైనా ఈ విషయం స్పష్టంగా అర్థమై ఉంటుంది. ప్రేక్షకుల కన్నా ఈ విషయం రిఫరీకి బాగా అర్థమైంది. అందుకే కోహ్లీకి ఫైన్ పడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా సారథి కోహ్లీకి జరిమానా విధిస్తున్నట్లు మ్యాచ్ అనంతరం రిఫరీలు ప్రకటించారు. జరిమానా అంతాఇంతా కాదు ఏకంగా 20 వేల డాలర్లు! మన కరెన్సీలో రూ.13.3 లక్షలు. సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ లో స్లో ఓవర్ రేట్ కు ఇంత భారీ స్థాయిలో జరిమానా ఉండదు కానీ ఐపీఎల్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన నిబంధనల్లో జరిమానాల స్థాయి భారీగా ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ ముగించాల్సిన సమయానికి ఆర్ సీబీ రెండు ఓవర్లు వెనుకబడిపోయింది.
శుక్రవారం నాటి మ్యాచ్ లో కోహ్లీ సేన ధోని సేనపై 13 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ దిగన ఆర్సీబీ ఏబీ డివిలియర్స్, కోహ్లీల దూకుడుతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పుణే ఆదినుంచే తడబడింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 172 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.