ముంబై విజయలక్ష్యం 163
ముంబై:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లోభాగంగా ఇక్కడ ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 163 పరుగుల లక్ష్యాన్నినిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరుకు కోహ్లి, మన్ దీప్ సింగ్లు ఇన్నింగ్స్ ను ఆరంభించారు. అయితే మన్ దీప్ సింగ్(17), విరాట్ కోహ్లి(20)లు ఇద్దరూ నిరాశపరిచి పెవిలియన్ కు చేరారు. బెంగళూరు 31 పరుగుల వద్ద మన్ దీప్ అవుట్ కాగా, ఆపై మరో తొమ్మిది పరుగుల వ్యవధిలో కోహ్లి వెనుదిరిగాడు. ఆ తరుణంలో ఏబీ డివిలియర్స్(43;27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) దాటిగా బ్యాటింగ్ చేసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు.
కాగా, అవతలి ఎండ్ నుంచి డివీకి పెద్దగా సహకారం లభించలేదు. స్కోరును పెంచే యత్నంలో షాట్ కు యత్నించి పెవిలియన్ చేరాడు డివిలియర్స్. ఆపై పవన్ నేగీ(35;23 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా, కేదర్ జాదవ్(28;22 బంతుల్లో 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. దాంతో బెంగళూరు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో మెక్లీన్ గన్ మూడు వికెట్లు సాధించగా,కృణాల్ పాండ్యాకు రెండు వికెట్లు లభించాయి. కరణ్ శర్మ, బూమ్రాలకు తలో వికెట్ దక్కింది.