అబుదాబి: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్ జట్టు క్రమంగా పట్టు బిగిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి లంక రెండో ఇన్నింగ్స్‌లో 61.3 ఓవర్లలో నాలుగు వికెట్లకు 186 పరుగులు చేసింది. ఓపెనర్ కౌశల్ సిల్వ (177 బంతుల్లో 81; 11 ఫోర్లు), సంగక్కర (99 బంతుల్లో 55; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. క్రీజులో చండిమాల్ (36 బంతుల్లో 24 బ్యాటింగ్; 4 ఫోర్లు) ఉన్నాడు.
జునైద్ ఖాన్, బిలావల్ భట్టికి రెండేసి వికెట్లు దక్కాయి. ప్రస్తుతం లంక ఏడు పరుగుల ఆధిక్యంలో ఉంది. మ్యాచ్‌కు ఇంకా రెండు రోజుల సమయం ఉండడంతో శుక్రవారం వీలైనంత త్వరగా మిగిలిన లంక ఆటగాళ్లను పెవిలియన్‌కు చేర్చితే లక్ష్యాన్ని ఛేదించేందుకు పాక్‌కు తగినంత సమయం ఉంటుంది.
అంతకుముందు 327/4 ఓవర్‌నైట్ స్కోరుతో తమ తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన పాక్ 129.1 ఓవర్లలో 383 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో 179 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. చివరి వరుస బ్యాట్స్‌మెన్ త్వరగానే పెవిలియన్‌కు చేరడంతో 56 పరుగులకే చివరి ఆరు వికెట్లను కోల్పోయింది. మిస్బా 135 (306 బంతుల్లో; 16 ఫోర్లు; 1 సిక్స్) పరుగులు చేశాడు. ఎరంగ, హెరాత్‌లకు మూడేసి, లక్మల్‌కు రెండు వికెట్లు దక్కాయి.
పట్టు బిగించిన పాక్
Published Fri, Jan 3 2014 1:08 AM | Last Updated on Sat, Mar 23 2019 8:32 PM
Advertisement