బ్రెసిలియా: ఇటలీ రిఫరీ తప్పిదాల వల్లే బెల్జియం ఓడిందని ఆ జట్టు కోచ్ మార్క్ విల్ మోట్స్ మండిపడ్డారు. ఆ రిఫరీ ఎంతసేపు అర్జెంటీనా కు అనుకూలంగా వ్యవహరించారే తప్పా.. ఆటలో నిబద్ధతను విడిచిపెట్టారని విమర్శించారు. మూడుసార్లు అర్జెంటీనా ఆటగాడు మెస్సీ నియమావళిని అధిగమించినా.. ఎల్లో కార్డు చూపించకపోవడం బాధాకరమన్నారు. అర్జెంటీనాకు మ్యాచ్ రిఫరీ అనుకూలంగా వ్యవహరించారనడానికి ఇదొక ఉదాహరణగా పేర్కొన్నాడు.
మ్యాచ్ ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడిన విల్ మోట్స్.. ' మ్యాచ్ జరుగుతున్న సమయంలో కేకలు పెట్టడానికి నేను పిల్లాడిని కాదు. పదే పదే అర్జెంటీనా తప్పిదాలు చేసింది. అయినా వారికి రిఫరీ ఎల్లో కార్డు చూపించలేదు. ఒక తప్పిదం కారణంగా మాకు ప్రతికూలంగా వ్యవహరించి ..ప్రత్యర్ధి జట్టు పట్ల అనుకూలంగా వ్యవహరించడం సరికాదన్నారు. అర్జెంటీనా-బెల్జియం మ్యాచ్ జరుగుతున్నంత సేపూ విల్ మోట్స్ బయట నుంచి పెద్దపెద్దగా అరుస్తూ కనిపించిన సంగతి తెలిసిందే.