
ముంబై: ఐపీఎల్–2020 కోసం జరిగే వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు 971 మంది క్రికెటర్లు ముందుకు వచ్చారు. తుది గడువు నవంబర్ 30లోగా వీరంతా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 713 మంది భారత ఆటగాళ్లు కాగా, 258 మంది విదేశీయులు. భారత క్రికెటర్లలో 19 మంది జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించగా... 634 మంది ఎప్పుడూ టీమిండియా తరఫున ఆడలేదు. మరో 60 మంది కనీసం ఒక ఐపీఎల్ మ్యాచ్ అయినా ఆడినవారున్నారు.
అయితే ఈ 971 మంది నుంచి తాము కోరుకుంటున్న ఆటగాళ్ల పేర్లను ఎనిమిది ఫ్రాంచైజీలు డిసెంబర్ 9లోగా సమర్పించాల్సి ఉంటుంది. ఆ జాబితాలో ఉన్న వారికే వేలంలో చోటు దక్కుతుంది. ఐపీఎల్‌లో ప్రస్తుతం గరిష్టంగా 73 మందిని మాత్రమే ఎంచుకునే అవకాశం ఉంది. డిసెంబర్ 19న కోల్‌కతాలో వేలం నిర్వహిస్తారు.
స్టార్క్ అవుట్: ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిషెల్ స్టార్క్ వరుసగా రెండో ఏడాది ఐపీఎల్‌కు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాడు. అతను 2019 ఐపీఎల్‌లో ఆడలేదు. మరోవైపు ఏడుగురు విదేశీ క్రికెటర్లు రూ. 2 కోట్ల కనీస ధరతో వేలానికి సిద్ధపడుతున్నారు. ఈ జాబితాలో కమిన్స్, హాజల్‌వుడ్, లిన్, మిషెల్ మార్ష్, మ్యాక్స్‌వెల్, స్టెయిన్, మాథ్యూస్ ఉన్నారు. భారత్ తరఫున ఆడిన 19 మందిలో ఒక్కరు కూడా ఈ కనీస విలువలో తమ పేరు చేర్చకపోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment