ధోనీని తప్పిస్తే.. రిస్క్ చేసినట్టే
ముంబై: టీమిండియా వన్డే కెప్టెన్ పదవి నుంచి మహేంద్ర సింగ్ ధోనీని తప్పిస్తే నష్టం తప్పదని మాజీ కోచ్ గ్యారీ కిర్స్టెన్ అభిప్రాయపడ్డాడు. భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి వన్డే జట్టు పగ్గాలు కూడా అప్పగించాల్సిన సమయం వచ్చిందా అన్న మీడియా ప్రశ్నకు ఆయన స్పందించలేదు. గొప్ప నాయకులు ఎప్పడు వారి కెరీర్ చివరి వరకు గొప్ప ఫలితాలు సాధిస్తారని ధోనీని ఉద్దేశస్తూ కిర్స్టెన్ చెప్పాడు.
వన్డే జట్టు కెప్టెన్గా ధోనీని తప్పించి, మరొకరికి కెప్టెన్సీ అప్పగిస్తే 2019లో ఇంగ్లండ్లో జరిగే ప్రపంచ కప్లో భారత విజయావకాశాలను చేజార్చుకోవచ్చని అభిప్రాయపడ్డాడు. వచ్చే ప్రపంచ కప్లో ధోనీ కెప్టెన్గా కొనసాగితే టీమిండియా విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పాడు. కాగా అప్పటివరకు ధోనీ కొనసాగుతాడో లేదో తనకు తెలియదని అన్నాడు. ధోనీ సామర్థ్యాన్ని సందేహించడం తప్పని, అతను గొప్ప ఆటగాడని కిర్స్టెన్ కితాబిచ్చాడు. 2011లో స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్లో గ్యారీ కిర్స్టెన్ శిక్షణలో ధోనీ సారథ్యంలోని టీమిండియా చాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే.