పాంటింగ్కు అరుదైన గౌరవం
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్కు అరుదైన గౌరవం దక్కింది. తన సొంత రాష్ట్రమైన తస్మానియాకు పాంటింగ్ ను బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో తస్మానియా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే పలు కార్యక్రమాల్లో పాంటింగ్ క్రియాశీలక పాత్ర పోషించనున్నాడు. ప్రధానంగా ఆ రాష్ట్ర అత్యున్నత స్థాయి వ్యాపార కార్యకలాపాలు, విద్యా వృద్ధి, ఎనర్జీ తదితర విభాగాల అభివృద్ధికి పాంటింగ్ ప్రాతినిధ్యం వహించనున్నాడు.
దీనిపై స్పందించిన పాంటింగ్ ఇది తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాన్నాడు. తనకున్న అంతర్జాతీయంగా ఉన్న సంబంధాలతో తస్మానియా రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తానని పాంటింగ్ తెలిపాడు. ఇందుకోసం ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటానని స్పష్టం చేశాడు.