నర్సింగ్ స్థానంలో ప్రవీణ్ రాణా
యునెటైడ్ రెజ్లింగ్‌కు ఐఓఏ సమాచారం
కొర్సిర్ సర్వే (స్విట్జర్లాండ్): డోపింగ్‌లో పట్టుబడిన భారత స్టార్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాలకు తెరపడింది. నర్సింగ్ యాదవ్ స్థానంలో పురుషుల ఫ్రీస్టయిల్ 74 కేజీల విభాగంలో భారత్ నుంచి ప్రవీణ్ రాణా బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్‌కు సమాచారం అందించింది. వాస్తవానికి నర్సింగ్ యాదవ్ డోపింగ్‌లో దొరికాడని ఆదివారం బయట పడినా... వారం రోజులకంటే ముందుగానే ఈ విషయాన్ని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ఐఓఏకు తెలియజేయడం... ఈ సమాచారాన్ని యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్‌కు ఐఓఏ అందజేయడం జరిగింది.
క్వాలిఫయింగ్ టోర్నీలో కాకుండా పోటీలు లేని సమయంలో నర్సింగ్ యాదవ్ డోపింగ్‌లో దొరికినందుకు.... అతని స్థానంలో భారత్ నుంచి వేరే రెజ్లర్‌ను పంపించే వెసులుబాటును కల్పిస్తున్నట్లు గత వారమే ఐఓఏకు యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాచారం ఇచ్చింది. ఒకవేళ ప్రత్యామ్నాయం లేకపోతే భారత్‌కు దక్కిన బెర్త్ ఖాళీ అవుతుందని ప్రకటించింది. దాంతో నర్సింగ్ యాదవ్ స్థానంలో ప్రవీణ్ రాణా పేరును సూచిస్తూ యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్‌కు ఐఓఏ తెలిపింది. ఈ మేరకు యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్ మంగళవారం తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ వార్తను ప్రచురించింది.