బ్యాడ్లక్ బింద్రా
♦ ‘షూట్ ఆఫ్’లో పతకం కోల్పోయిన భారత షూటర్
♦ నాలుగో స్థానంతో సరి
ఒలింపిక్స్‌లో వ్యక్తిగత స్వర్ణం ఎలా ఉంటుందో భారత దేశానికి చూపించిన ఘనుడు... అనేక ప్రపంచ స్థాయి పోటీలలో త్రివర్ణాన్ని రెపరెపలాడించిన యోధుడు... భారత షూటింగ్ దిగ్గజం అభినవ్ బింద్రా భారంగా కెరీర్‌ను ముగించాడు. రియో తన ఆఖరి ఈవెంట్ అని ముందే ప్రకటించిన బింద్రా... పతకం సాధించకపోయినా, ఆఖరి క్షణం వరకూ పోరాడి ఆకట్టుకున్నాడు. పతాకధారిగా బ్రెజిల్ వెళ్లిన అభినవ్... పతకాన్ని కోల్పోయినా మనసులు గెలిచాడు.
త్రుటిలో పతకం అవకాశం కోల్పోయిన అభినవ్ బింద్రా పోటీలకు ముందు కొత్త రైఫిల్‌తో సిద్ధం కావాల్సి వచ్చింది. సోమవారం ఉదయం అతను తన గన్‌తో సహా జారి పడ్డాడు. దాంతో అందులో కీలకమైన ‘సైట్’ విరిగిపోయింది. దాంతో అప్పటికప్పుడు రైఫిల్‌ను మార్చుకున్నాడు. నిజానికి షూటింగ్‌లాంటి ఈవెంట్‌లో ఇన్ని రోజులుగా సాధన చేసిన, అలవాటైన ఉపకరణంతో కాకుండా కొత్తదానితో ఆడటం అంత సులువు కాదు. అందుకు సర్దుకునేందుకు చాలా సమయం పడుతుంది. కానీ ఇలాంటి గందరగోళం తర్వాత కూడా బింద్రా తన స్థాయిలో చివరి వరకు పోరాడాడు. షూటాఫ్‌లో మెడల్ చేజారి నాలుగో స్థానం దక్కింది. రిటైర్మెంట్‌పై ఇదే తుది నిర్ణయమా అనే ప్రశ్నకు జవాబిస్తూ బింద్రా... ‘నా వద్ద కొత్త రైఫిల్ అమ్మకానికి ఉంది. మీకేమైనా కావాలా’ అని సరదాగా బదులిచ్చాడు.
రియో డి జనీరో: ఒక్క షాట్‌తోనే పతకావకాశాలు తారుమారు అవుతాయని షూటింగ్‌లో మరోసారి రుజువైంది. రియో ఒలింపిక్స్‌లో భారత స్టార్ షూటర్ అభినవ్ బింద్రాకు ఈ చేదు అనుభవం ఎదురైంది. సోమవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో అభినవ్ బింద్రా నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకాన్ని కోల్పోయాడు. ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో ఏడు సిరీస్‌ల తర్వాత అభినవ్ బింద్రా, సెరిహి కులిష్ (ఉక్రెయిన్) 163.8 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. దాంతో మూడు-నాలుగు స్థానాలను నిర్ణయించేందుకు ఇద్దరికీ ఒక్కో షాట్ అవకాశం ఇచ్చారు.
ఇందులో బింద్రా 10 పాయింట్లు స్కోరు చేయగా... కులిష్ 10.5 స్కోరు చేసి ముందంజ వేశాడు. ఆ తర్వాత నికోలో కాంప్రియాని (ఇటలీ), వ్లాదిమిర్ మస్లెనికోవ్ (రష్యా), సెరిహి కులిష్ స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం పోటీ పడ్డారు. చివరకు కాంప్రియాని (206.1 పాయింట్లు) పసిడి సొంతం చేసుకున్నాడు. కులిష్ (204.6 పాయింట్లు) రజతం సంపాదించగా... మస్లెనికోవ్ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. అంతకుముందు క్వాలిఫయింగ్‌లో అభినవ్ బింద్రా 625.7 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంతో ఫైనల్‌కు అర్హత సాధించాడు. లండన్ ఒలింపిక్స్‌లో ఇదే ఈవెంట్‌లో కాంస్యం సాధించిన భారత షూటర్ గగన్ నారంగ్ ఈసారి విఫలమయ్యాడు. క్వాలిఫయింగ్‌లో ఈ హైదరాబాద్ షూటర్ 621.7 పాయింట్లు సాధించి 23వ స్థానంలో నిలిచాడు. క్వాలిఫయింగ్‌లో టాప్-8లో నిలిచినవారు ఫైనల్లో పోటీపడ్డారు.
భారత ఒలింపిక్స్ చరిత్రలో.. ఆ మాటకొస్తే ప్రపంచ షూటింగ్‌లో బింద్రా ఓ మరిచిపోలేని అధ్యాయం. భారతీయులు షూటింగ్‌కు పనికిరారనే అపవాదును తొలగించి.. పట్టుదలతో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సత్తాచాటాడు. టాయ్ గన్స్‌తో మొదలైన ప్రాక్టీస్‌ను ఒలింపిక్స్ మెడల్‌గా మార్చటం అంత సులువేం కాదు. జర్మనీలో విదేశీయులను వ్యతిరేకిస్తున్నా.. కదిలేది లేదంటూ కఠోరమైన సాధన చేశాడు. బాడీ బ్యాలెన్స్, హ్యాండ్-ఐ కోఆర్డినేషన్‌తో జర్మన్ కోచ్‌ను ఒప్పించాడు.
ఆటతోనే కాదు.. దృక్పథంతోనూ అందర్నీ మెప్పించాడు. ఏక కాలంలో ప్రపంచ చాంపియన్, ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచిన తొలి, ఏకైక భారతీయుడు అభినవ్ బింద్రానే. 2006లో ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ (ఐఎస్‌ఎస్‌ఎఫ్) వరల్డ్ చాంపియన్ షిప్‌లో బంగారు పతకం, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో 10మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో బంగారు పతకంతో షూటింగ్ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. భారత్‌కు ఓ వ్యక్తిగత క్రీడాంశంలో స్వర్ణం రావడం అదే తొలిసారి. ఈ ఫీట్ సాధించటం ఓ భారతీయుడికి నిజంగా కలే. మూడు ఒలింపిక్స్‌లో (ఏథెన్స్, బీజింగ్, రియో) ఫైనల్స్ చేరిన తొలి భారత షూటర్ కూడా బింద్రానే.
సిడ్నీతో మొదలై
జర్మనీలో శిక్షణ పొందుతున్నప్పుడే 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించాడు బింద్రా. అప్పుడు పెద్దగా రాణించలేకపోయినా.. 2001 ప్రపంచకప్‌లో కాంస్యం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. అదే ఏడాది వివిధ అంతర్జాతీయ ఈవెంట్లలో ఆరు బంగారు పతకాలు గెలిచాడు. 2002 కామన్వెల్త్ క్రీడల్లో బంగారం గెలిచి ఉత్సాహంగా ఏథెన్స్ ఒలింపిక్స్‌కు వెళ్లాడు. 597 పాయింట్లతో ఒలింపిక్ రికార్డును బ్రేక్ చేసినా ఫైనల్లో తడబాటుకు గురై ఎలిమినేట్ అయ్యాడు.
2006లో జాగ్రెబ్‌లో జరిగిన ప్రపంచచాంపియన్ షి్‌ప్‌లో బంగారు పతకం గెలిచిన తొలి భారతీయుడిగా నిలిచాడు. మెల్‌బోర్న్ కామన్వెల్త్‌లో బంగారం ఆ తర్వాత జరిగిన వివిధ అంతర్జాతీయ ఈవెంట్లలోనూ సత్తా చాటాడు. షూటింగ్‌లో త్రివర్ణ పతాకానికి గౌరవం కల్పించిన అభినవ్ బింద్రాకు 2000లో అర్జున అవార్డు, 2001లో ప్రతిష్ఠాత్మక రాజీవ్ ఖేల్ రత్న అవార్డులు వరించాయి. తన ప్రతిభను నేటి తరానికి పంచేందుకు గోస్పోర్ట్ ఫౌండేషన్‌తో జతకలిసిన బింద్రా.. రిటైర్మెంట్ తర్వాత షూటింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నాడు.