సాక్షి క్రీడావిభాగం : వరుసగా మూడు ఒలింపిక్స్ క్రీడల్లో (2004 ఏథెన్స్, 2008 బీజింగ్, 2012 లండన్) భారత్‌కు వ్యక్తిగత పతకాలు అందించిన క్రీడాంశం షూటింగ్. ఏథెన్స్‌లో రాజ్యవర్ధన్ రాథోడ్ రజతం... బీజింగ్‌లో అభినవ్ బింద్రా స్వర్ణం... లండన్‌లో విజయ్ కుమార్ రజతం, గగన్ నారంగ్ కాంస్యం గెలిచారు. దాంతో రియో ఒలింపిక్స్‌లోనూ మళ్లీ పతకం ఖాయమని షూటింగ్‌పై అందరూ భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ మన షూటర్ల గురి తప్పింది. ‘రియో’కు అర్హత పొందిన 12 మందిలో అభినవ్ బింద్రా మినహా మిగతా వారు కనీసం టాప్–5లో నిలువలేకపోయారు. ఫలితంగా భారత షూటర్లు రిక్త హస్తాలతో స్వదేశానికి తిరిగొచ్చారు. ఒకవైపు అనుభవజ్ఞులైన షూటర్లు విఫలమవ్వగా... మరోవైపు నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) మాత్రం ‘రియో’ ఫలితాలతో వెంటనే మేల్కొంది. ప్రతిభావంతులైన కొంతమంది యువ షూటర్లను ఎంపిక చేసింది. మాజీ స్టార్ షూటర్లు జస్పాల్ రాణా, దీపాలి దేశ్‌పాండే ఆధ్వర్యంలో వారికి శిక్షణ మొదలైంది. రెండేళ్లు తిరిగేలోపు ఈ యువ షూటర్లు ఆశ్చర్యపరిచే ఫలితాలు సాధించారు. ఆదివారం రాత్రి మెక్సికోలో ముగిసిన సీజన్ తొలి ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భారత షూటర్లు నాలుగు స్వర్ణాలు, నాలుగు కాంస్యాలు, ఒక రజతంతో కలిపి మొత్తం తొమ్మిది పతకాలు సాధించారు. దాంతో 32 ఏళ్ల ప్రపంచకప్ టోర్నీల చరిత్రలో తొలిసారి భారత్ పతకాల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకొని కొత్త చరిత్ర లిఖించింది.
కెరీర్‌లో ఆడిన తొలి ప్రపంచకప్‌లోనే 23 ఏళ్ల షాజర్ రిజ్వీ, 17 ఏళ్ల హరియాణా అమ్మాయి మనూ భాకర్, 18 ఏళ్ల బెంగాల్ షూటర్ మెహులీ ఘోష్ పతకాల బోణీ కొట్టారు. రిజ్వీ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించడమే కాకుండా కొత్త ప్రపంచ రికార్డును సృష్టించాడు. మనూ భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, మిక్స్‌డ్ ఈవెంట్‌లో ఒక్కో పసిడి పతకం సొంతం చేసుకుంది. మెహులీ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో, మిక్స్‌డ్ ఈవెంట్‌లో ఒక్కో కాంస్యం సాధించింది. కెరీర్‌లో రెండో ప్రపంచకప్ ఆడిన అఖిల్ షెరాన్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో పలువురు స్టార్ షూటర్లను వెనక్కినెట్టి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
పతక విజేతలు వీరే...
స్వర్ణాలు
►మనూ భాకర్: మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్; మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ (ఓం ప్రకాశ్ జతగా).
►షాజర్ రిజ్వీ: పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్.
►అఖిల్ షెరాన్: పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్.
రజతం
►అంజుమ్ ముద్గిల్: మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్.
కాంస్యాలు
►రవి కుమార్: పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్.
►జీతూ రాయ్: పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్.
►మెహులీ ఘోష్: మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్, మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (దీపక్ కుమార్ జతగా).
‘మెక్సికో ప్రపంచకప్ టోర్నీలో భారత షూటింగ్‌లో కొత్త శకం మొదలైంది. భారత షూటింగ్ భవిష్యత్‌కు ఈ యువ షూటర్లు భరోసా ఇచ్చారు. రాబోయే కాలంలోనూ ఈ యువ షూటర్లు ఇదే ఉత్సాహంతో ఒలింపిక్స్‌లో శిఖరాగ్రాన నిలవాలని ఆశిస్తున్నాను. యువ షూటర్ల విజయంలో తెరవెనుక ఉండి కీలకపాత్ర పోషించిన వారందరికి తగిన గుర్తింపు ఇవ్వాలి’.
– అభినవ్ బింద్రా
Comments
Please login to add a commentAdd a comment