![గంభీర్ స్థానంలో రిషబ్](/styles/webp/s3/article_images/2017/09/5/61486708385_625x300.jpg.webp?itok=8Cs3_9tx)
గంభీర్ స్థానంలో రిషబ్
న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర క్రికెట్ జట్టు కెప్టెన్ గా గౌతం గంభీర్ ను తొలగించేందుకు రంగం సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా ఢిల్లీ రాష్ట్ర వన్డే కెప్టెన్గా వికెట్ కీపర్ రిషబ్ పంత్ను నియమిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలం ఢిల్లీ కెప్టెన్గా ఎవర్ని నియమించాలనే దానిపై పెద్దగా అన్వేషించకపోయినా, ఆ స్థానానికి రిషబ్ అయితేనే సరిగ్గా ఉంటుందని ఢిల్లీ సెలక్షన్ కమిటీ భావించింది. ఈ మేరకు రిషబ్ ను ఢిల్లీ వన్డే కెప్టెన్ గా నియమించినట్లు సెలక్షన్ కమిటీ చైర్మన్ అతుల్ వాసన్ తెలిపారు. తమ సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని గంభీర్ కు తెలియజేసినట్లు ఆయన పేర్కొన్నారు.
'నిజంగా చెప్పాలంటే విజయ్ హజారే టోర్నీలో భాగంగానే రిషబ్ గురించి ప్రస్తావన వచ్చింది. గంభీర్ తరువాత మా రాష్ట్ర కెప్టెన్ ఎవరు అనేది దానిపై చర్చించాం. దానిలో భాగంగానే వచ్చే వన్డే టోర్నీకి రిషబ్ ను కెప్టెన్ గా నియమించాం. గౌతం గంభీర్ మార్గదర్శకత్వంలో రిషబ్ రాటు దేలతాడు. విజయ్ హజారే టోర్నీ రిషబ్ కెప్టెన్సీ స్కిల్స్ కు పరీక్ష' అని ఢిల్లీ సెలక్టర్ నిఖిల్ చోప్రా పేర్కొన్నారు.