కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్‌పై తఫాజ్జుల్ రిజ్వి దాఖలు చేసిన పరువు నష్టం కేసులో తమకేటి సంబంధం అంటుంది పీసీబీ. పీసీబీ లీగల్ అడ్వైజర్‌గా పని చేస్తున్న తఫాజ్జుల్ రిజ్వి పిటిషన్‌లో తమ పాత్ర ఏమీ లేదని డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతోంది. ఒక వివాదంలో అక్తర్‌పై పరువు నష్టం దావా కేసు వేయగా, దాన్ని ఫెడరల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్‌ఐఏ) విచారించనుంది. ఈ క్రమంలోనే అక్తర్‌కు ఇప్పటికే సమన్లు పంపిన ఎఫ్‌ఐఏ.. ఈరోజు విచారణ చేపట్టనుంది. తొలుత అక్తర్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసి తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా.. వద్దా అనే అంశాన్ని పరిశీలిస్తామని ఇప్పటికే ఒక ఎఫ్‌ఐఏ అధికారి చెప్పగా, ఇప్పుడు పీసీబీ మాత్రం ఆ అంశంలో తమకు సంబంధం లేదని అంటోంది. గత నెల్లో అక్తర్ వ్యాఖ్యలు చేసినప్పుడు సీరియస్‌గా స్పందించిన పీసీబీ.. ఇప్పుడు మాత్రం ఆ వివాదంలోకి తమను లాగొద్దని తెలిపింది. పీసీబీ అధికారి ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘ రిజ్వీ ఫిర్యాదుపైనే అక్తర్‌కు సమన్లు జారీ అయ్యాయి. ఈ విషయంలో బోర్డుకు సంబంధం లేదు. అక్తర్‌పై రిజ్వి వ్యక్తిగత ఫిర్యాదులో భాగంగానే పరువు నష్టం దావా వేశాడు. అంతే కానీ అక్తర్‌పై మేము ఎటువంటి కేసు వేయలేదు’ అని తెలిపారు. (‘అందులో ఐపీఎల్ కంటే పీఎస్‌ఎల్ భేష్’)
ఇక అక్తర్ మాట్లాడుతూ.. ‘నేను ఎఫ్‌ఐఏ నుంచి ఒక నోటీసును అందుకున్నా. అది చాలా అస్పష్టంగా ఉంది. వారు నాకు పంపిన నోటీసు గందరగోళానికి గురి చేసేలా అస్పష్టంగా ఉంది. నా లాయర్ సల్మాన్ నియాజీతో మాట్లాడిన తర్వాత తదుపరి కార్యాచరణ ఏమిటనేది చెబుతా’ అని అక్తర్ తెలిపాడు. కాగా, తనపై అసభ్య పదజాలం వాడటమే కాకుండా న్యాయపరమైన అంశాల్లో అక్తర్ తలదూర్చిందుకు గాను అతనిపై పరువు నష్టం దావా వేశాడు రిజ్వి. ఈ క్రమంలోనే 100 మిలియన్ల పాకిస్తాన్ కరెన్సీ చెల్లించాలంటూ అందులో పేర్కొన్నాడు. అవినీతి ఆరోపణల్లో భాగంగా పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై మూడేళ్లు నిషేధం విధించిన సందర్భంలో పీసీబీ లీగల్ డిపార్ట్‌మెంట్‌పై అక్తర్ అసంబద్ధ వ్యాఖ్యలు చేశాడు.
తన యూట్యూబ్ చానల్‌లో అక్మల్‌పై మూడేళ్ల నిషేధాన్ని తప్పుబట్టాడు. ఇది పీసీబీ లీగల్ అడ్వైజరీ అసమర్థవత వల్లే ఉమర్‌కు మూడేళ్ల శిక్ష పడిందంటూ వ్యాఖ్యానించాడు. అదే సమయంలో రిజ్విపై ఆరోపణలు చేశాడు. చాలా సున్నితమైన అంశాల్లో రిజ్వికి అనుభవం లేదంటూ విమర్శించాడు. పీసీబీ లీగల్ డిపార్ట్‌మెంట్ అనేది కుళ్లిన టెంక అంటూ విమర్శలు చేశాడు. పీసీబీ అండదండలు ఉన్న కారణంగానే రిజ్వి సుదీర్ఘ కాలం లీగల్ అడ్వైజర్‌గా కొనసాగుతున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంలో పీసీబీ కూడా సీరియస్ అయ్యింది. న్యాయపరమైన అంశాల్లో అక్తర్ తలదూర్చడం మంచిది కాదంటూ హెచ్చరించింది. ఈ క్రమంలోనే అక్తర్‌పై రిజ్వి పరువు నష్టం కేసు వేశాడు. బోర్డు సాయంతోనే కేసు వేసినట్లు అందరికీ తెలుస్తున్నా, తమకేమీ సంబంధం లేదంటూ తప్పించుకునే పనిలో పడింది పీసీబీ.(విదేశాల్లో ఐపీఎల్-2020? బీసీసీఐ సమాలోచన)
Comments
Please login to add a commentAdd a comment