పుణే: ప్రొఫెషనల్ సర్క్యూట్‌లో జతకట్టిన తొలిసారే భారత టెన్నిస్ డబుల్స్ స్టార్స్ రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ జంట టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. శనివారం ముగిసిన టాటా ఓపెన్ ఏటీపీ–250 టోర్నమెంట్‌లో టాప్ సీడ్ హోదాకు న్యాయం చేస్తూ బోపన్న–దివిజ్ జోడీ విజేతగా నిలిచింది. 63 నిమిషాలపాటు జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న–దివిజ్ ద్వయం 6–3, 6–4తో ల్యూక్ బాంబ్రిడ్జ్–జానీ ఒమారా (బ్రిటన్) జోడీపై గెలిచింది. భారత జంట మూడు ఏస్‌లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. బోపన్న కెరీర్‌లో ఇది 18వ డబుల్స్ టైటిల్‌కాగా... దివిజ్ శరణ్‌కు నాలుగోది. స్వదేశంలో మాత్రం దివిజ్‌కిదే తొలి టైటిల్ కావడం విశేషం.
టైటిల్ నెగ్గిన బోపన్న–దివిజ్ జంటకు 29,860 డాలర్ల (రూ. 20 లక్షల 77 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. టైటిల్ గెలిచే క్రమంలో ఈ భారత జంట క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్స్‌లో మారథాన్ సూపర్ టైబ్రేక్‌లలో విజయం సాధించింది. పేస్–వరేలాలతో క్వార్టర్స్ మ్యాచ్‌లో మూడో సెట్‌ను 17–15తో... బోలెలీ–డోడిగ్‌లతో జరిగిన సెమీస్‌లో 15–13తో భారత జంట గెలిచింది. తాజా విజయం వచ్చే వారం మొదలయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌కు ముందు కావాల్సినంత ఆత్మ విశ్వాసం ఇచ్చిందని 38 ఏళ్ల బోపన్న వ్యాఖ్యానించాడు. గతేడాది జకార్తా ఆసియా క్రీడల్లో బోపన్న–దివిజ్ జంట స్వర్ణ పతకం నెగ్గిన అనంతరం 2020 టోక్యో ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది ప్రొఫెషనల్ సర్క్యూట్‌లోనూ జతకలిసి ఆడాలని నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment