
ఒక్క భారీ సెంచరీ.. మూడు రికార్డులు బద్దలు
లీడ్స్: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశం టీమిండియా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ముంగిట నిలిచింది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఇప్పటికే ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఏకంగా నాలుగు శతకాలు బాదిన రోహిత్ శర్మ 544 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అయితే లీగ్ చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై ఒక్క భారీ ఇన్నింగ్స్ ఆడితే ఇప్పటివరకు ఎవ్వరికీ సాధ్యం కాని పలు రికార్డులను రోహిత్ నెలకొల్పె అవకాశం ఉంది.
ప్రపంచకప్‌లో ఇప్పటివరకు నాలుగు శతకాలు బాది శ్రీలంక మాజీ దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కర(4 శతకాలు, 7 ఇన్నింగ్స్‌ల్లో) సరసన చేరాడు. మరొక శతకం సాధిస్తే ఒక ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన తొలి క్రికెటర్‌గా హిట్ మ్యాన్ నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఓవరాల్‌గా ప్రపంచకప్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే ఐదు శతకాలు బాదిన ఆటగాడిగా రోహిత్ సరికొత్త రికార్డును సృష్టించాడు. (చదవండి: రోహిత్ సిక్స్ కొడితే.. ఆమెను తాకింది!!)
అంతేకాకుండా ఒక ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్(673; 2003 ప్రపంచకప్‌లో) రికార్డుపై కూడా రోహిత్ కన్నేశాడు. ఈ టోర్నీలో మరో 129 పరుగులు సాధిస్తే రోహత్ సచిన్ రికార్డును బద్దలుకొడతాడు. ఇక శ్రీలంకపైనే ఈ పరుగులు సాధిస్తే ప్రపంచకప్ లీగ్‌లో అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పుతాడు. ఇప్పటివరకు ఈ జాబితాలో సచిన్(586; 2003లో), మాథ్యూ హెడెన్(580; 2007లో)తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. (చదవండి: సచిన్ తర్వాత రోహిత్ శర్మనే)
ఇక రోహిత్ ఈ టోర్నీలో ఇప్పటివరకు 90.66 సగటుతో 96.96 స్రైక్ రేట్‌తో 544 పరుగులు సాధించాడు. ప్రపంచకప్‌లో 500పైకి పైగా పరుగులు సాధించి అత్యధిక సగటు కలిగి ఉన్న రెండో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో సంగక్కర(108.20 సగటు; 2015) ఆగ్ర స్థానంలో ఉన్నాడు. దీంతో తదుపరి మ్యాచ్‌ల్లో తన ఫామ్‌ను ఇలాగే కొనసాగిస్తే సంగక్కర రికార్డును కూడా రోహిత్ అధిగమించే అవకాశం ఉంది. (చదవండి: రోహిత్ ఔట్.. రితిక అసహనం)
లంక అంటే చెలరేగడమే..
ప్రపంచకప్ చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా తలపడబోయే శ్రీలంకపై రోహిత్‌కు ఘనమైన రికార్డే ఉంది. హిట్ మ్యాన్ తాను సాధించిన మూడు డబుల్ సెంచరీల్లో రెండు(264, 208 నాటౌట్) లంకేయులపైనే కావడం విశేషం. దీంతో లంకపైనే భారీ శతకం బాది ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర సృష్టిస్తాడని క్రీడా పండితులు పేర్కొంటున్నారు. శనివారం శ్రీలంకతో జరగనున్న మ్యాచ్‌తో సంబంధంలేకుండా టీమిండియా ఇప్పటికే సెమీస్‌కు చేరిన విషయం తెలిసిందే.