జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా పర్యటనలో భారత ఓపెనర్ రోహిత్ శర్మ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. టెస్టుల్లోనే కాక వన్డేల్లోనూ అతను ఘోరంగా విఫలమవుతున్నాడు. రెండు టెస్టుల్లో వరుసగా 11, 10, 10, 47 పరుగులు చేసి మూడో టెస్టుకు జట్టులో చోటు కోల్పోయిన రోహిత్.. తనకు మంచి రికార్డున్న వన్డేల్లో సైతం మరింత పేలవ ప్రదర్శన చేస్తున్నాడు.
ఆరు వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌లో ఇప్పటివరకూ సఫారీలతో జరిగిన నాలుగు వన్డేల్లో రోహిత్ నమోదు చేసిన స్కోర్లు 20, 15, 0, 5. ఈ పర్యటనలో ఇప్పటిదాకా ఎనిమిది ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్.. ఆరుసార్లు దక్షిణాఫ్రికా యువ ఫాస్ట్‌బౌలర్ కాగిసో రబడా బౌలింగ్‌లోనే అవుట్ కావడం గమనార్హం. 145 కిలోమీటర్లకు తగ్గని వేగంతో బంతులేసే రబడా దెబ్బకు రోహిత్ విలవిల్లాడుతున్నాడు. అయితే శనివారం రోహిత్ అవుటైన బంతి అంత కష్టమైందేమీ కాదు. యార్కర్, గుడ్ లెంగ్త్ మిక్సింగ్ డెలవరీకి డ్రైవ్ చేయబోయిన రోహిత్ శర్మ.. రబాడకే దొరికేశాడు.
ఒకవైపు తన లాగే ఫాస్ట్ పిచ్‌లపై ఆడలేడని పేరున్న ధావన్ వన్డేల్లో నిలకడగా రాణిస్తుండగా.. రోహిత్ మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తూ తన స్థానాన్ని ప్రశ్నార్థకం చేసుకునే పరిస్థితిని కొనితెచ్చుకున్నాడు. తదుపరి రెండు వన్డేల్లో రోహిత్ కనుక నిరాశపరిస్తే మాత్రం అతన్ని కొన్నాళ్లపాటు పక్కన పెట్టిన ఆశ్చర్యపోనక‍్కర్లేదు. టీమిండియా జట్టులో నెలకొన్న పోటీ నేపథ్యంలో సఫారీలతో రెండు వన్డేలు రోహిత్‌కు చాలా కీలకం.
Comments
Please login to add a commentAdd a comment