మొహాలీ: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో వన్డేల్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. దీంతో లంకకు 393 పరుగుల భారీ లక్ష్యం నిర్ధేశించారు. భారత్ 50 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 392 పరుగులు చేసింది.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ(208 నాటౌట్), ధావన్(68)లు మంచి శుభారంభాన్ని అందించారు. 10 ఓవర్లలోపు నెమ్మదిగా ఆడిన ఈ జోడి అనంతరం చెలరేగింది. ఈ దశలో ధావన్ కెరీర్‌లో 35వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. జట్టు స్కోరు 115 పరుగుల వద్ద ధావన్ క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌తో రోహిత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.
తొలి మ్యాచ్‌లో దారుణంగా విఫలమై కెప్టెన్‌గా చెత్త రికార్డు మూటగట్టుకున్న రోహిత్ అంతకంతకు లంక బౌలర్లపై బదులు తీర్చుకున్నాడు. 110 బంతుల్లో రోహిత్ 8 ఫోర్లు ఒక సిక్సుతో కెరీర్‌లో 16వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం శ్రేయస్ అయ్యర్ 50 బంతుల్లో 5 ఫోర్లతో కెరీర్ తొలి అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం చెలరేగిన ఈ ఇద్దరు స్కోరు బోర్డును పరుగెత్తించారు.
రోహిత్ డబుల్ సెంచరీ..
అరంగేట్ర మ్యాచ్ అనుభవంతో తొలుత ఆచితూచి ఆడిన అయ్యర్ హాఫ్ సెంచరీ అనంతరం తన ఐపీఎల్ అనుభవాన్ని ప్రదర్శించాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకపడుతూ లంక బౌలర్లను ఓ ఆట ఆడాడు. వేగంగా ఆడుతూ తన అసలైన సత్తా ఎంటో నిరూపించుకున్నాడు. మరోవైపు రోహిత్ కూడా సెంచరీ అనంతరం చెలరేగి ఆడాడు. లక్మల్ వేసిన 43వ ఓవర్లో ఏకంగా 4 సిక్సులతో విరుచుకుపడ్డాడు. దీంతో 18 బంతుల్లోనే మరో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
ఈ దశలో శ్రేయస్ అయ్యర్ (88) భారీ షాట్‌కు ప్రయత్నించి శతకాన్ని చేజార్చుకున్నాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ధోని(7) ఓ సిక్సు కొట్టి అవుటయ్యాడు. ఇక చివర్లో రోహిత్ 151 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఈ విధ్వంసానికి లంక బౌలర్లు పరుగులివ్వడంలో పొటీ పడ్డారు. తొలి మ్యాచ్‌లో విజృంభించిన లక్మల్(71), ప్రదీప్‌లు(103) పరుగులు సమర్పించుకున్నారు. చివరి బంతికి పాండ్యా(8) క్యాచ్ అవుటయ్యాడు. లంక బౌలర్లలో పెరీరాకు మూడు సచిత్ పతిరాణకు ఓ వికెట్ దక్కింది.
గర్జించిన భారత బ్యాట్స్‌మెన్
Comments
Please login to add a commentAdd a comment