రోహిత్ మళ్లీ హిట్... భారత్ మళ్లీ ఫ్లాప్!
రెండో వన్డేలోనూ ఓడిన ధోని సేన
7 వికెట్లతో ఆసీస్ ఘన విజయం
బ్రిస్బేన్: భారీ స్కోరు సాధించినా ‘గాబా’లోనూ టీమిండియా రాత మారలేదు. శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (127 బంతుల్లో 124; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) మరో శతకంతో చెలరేగాడు. అతడికి రహానే (80 బంతుల్లో 80; 6 ఫోర్లు, 1 సిక్స్), కోహ్లి (67 బంతుల్లో 59; 4 ఫోర్లు) అండగా నిలిచారు. అనంతరం ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 3 వికెట్లకు 309 పరుగులు చేసింది. జార్జ్ బెయిలీ (58 బంతుల్లో 76 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), ఫించ్ (81 బంతుల్లో 71; 7 ఫోర్లు, 1 సిక్స్), షాన్ మార్ష్ (84 బంతుల్లో 71; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించగా, స్మిత్ (47 బంతుల్లో 46; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
మ్యాచ్ విశేషాలు...
రెండో వికెట్‌కు కోహ్లితో 125 పరుగులు జోడించిన రోహిత్... మూడో వికెట్‌కు రహానేతో 121 పరుగులు జత చేశాడు. రోహిత్ 89 పరుగుల వద్ద పారిస్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చినా... అంపైర్ నాటౌట్‌గా ప్రకటించారు. రీప్లేలో బంతి రోహిత్ బ్యాట్‌కు తగిలినట్లు కనిపించింది. ఫాల్క్‌నర్ బౌలింగ్‌లో రహానే ఆడిన స్ట్రెయిట్ డ్రైవ్ బౌలర్ చేతికి తగులుతూ నాన్ స్ట్రయికింగ్ వికెట్లపై పడింది. అప్పటికే క్రీజ్ దాటి బయటకు వచ్చిన రోహిత్ శర్మ దురదృష్టవశాత్తూ రనౌట్‌గా వెనుదిరిగాడు. రోహిత్ వన్డే కెరీర్‌లో ఇది పదో సెంచరీ. ఆరంభంలో ఇబ్బంది పడుతూ ఆడిన షాన్ మార్ష్ జడేజా బౌలింగ్‌లో 19 పరుగుల వద్ద ఇచ్చిన అతి సునాయాస క్యాచ్‌ను లాంగాన్‌లో ఇషాంత్ శర్మ వదిలేయడం మ్యాచ్‌పై ప్రభావం చూపించింది. ఆ తర్వాత కూడా రెండుసార్లు కష్టసాధ్యమైన క్యాచ్‌లనుంచి తప్పించుకున్న మార్ష్ 71 పరుగులతో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.