గౌహతి వేదికగా భారత్‌తో జరిగిన మూడో టీ20లో సుడిగాలి శతకంతో (48 బంతుల్లో 104 నాటౌట్; 8 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడిన మ్యాక్స్‌వెల్.. టీ20ల్లో ఆసీస్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ (47 బంతుల్లో) రికార్డుతో పాటు మరో ప్రపంచ రికార్డును కూడా సమం చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీల (4) రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉండగా.. తాజాగా మ్యాక్స్‌వెల్ ఆ రికార్డును సమం చేశాడు. మ్యాక్సీ ఈ ప్రపంచ రికార్డును తన వందో మ్యాచ్‌లో సాధించడం విశేషం.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు..
- రోహిత్ శర్మ-4
- గ్లెన్ మ్యాక్స్‌వెల్-4
- బాబర్ ఆజమ్-3
- సబావూన్ దవిజి-3
- కొలిన్ మున్రో-3
- సూర్యకుమార్ యాదవ్-3
విజయవంతమైన ఛేదనల్లో అత్యధిక సెంచరీలు..
భారత్‌తో జరిగిన మూడో టీ20లో సెంచరీతో మ్యాక్స్‌వెల్ మరో రికార్డును కూడా సాధించాడు. విజయవంతమైన ఛేదనల్లో అత్యధిక సెంచరీలు (3) చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో బాబర్ ఆజమ్ (2), ముహమ్మద్ వసీమ్ (2) మ్యాక్సీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
భారత్‌పై అత్యధిక సిక్సర్లు..
నిన్నటి మ్యాచ్‌లో 8 సిక్సర్లు కొట్టిన మ్యాక్స్‌వెల్ టీ20ల్లో భారత్‌పై అత్యధిక సిక్సర్లు (37) బాదిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఓ జట్టుపై అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో సెర్బియా ఆటగాడు లెస్లీ డన్‌బర్ (బల్గేరియాపై 42 సిక్సర్లు) అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ రెండో స్థానంలో (వెస్టిండీస్‌పై 39 సిక్సర్లు) నిలిచాడు.
ఇదిలా ఉంటే, భారత్‌తో జరిగిన మూడో టీ20లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో భారత్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. రుతురాజ్ అజేయమైన మెరుపు శతకంతో (57 బంతుల్లో 123 నాటౌట్; 13 ఫోర్లు, 7 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో మ్యాక్స్‌వెల్ చివరి బంతికి బౌండరీ బాది ఆసీస్‌ను గెలిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment