
సాక్షి, విశాఖపట్నం: ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు పలువురు టీమిండియా క్రికెటర్లు బుధవారం సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నారు. బెంగళూరు నుండి ఇండిగో విమానంలో విశాఖ విమానాశ్రయం చేరుకున్న వీరు రోడ్డు మార్గాన నొవోటెల్ హోటల్‌కు వచ్చారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరం వేదికగా రేపటి నుంచి మూడు రోజులు పాటు జరగనున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో అతడు ఆడతాడు. పీవీజీ రాజు ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు దక్షిణాఫ్రికా, ఇండియా బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్ల మధ్య సన్నాహక టెస్ట్ మ్యాచ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇండియా బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు. మయాంక్ అగర్వాల్, కరుణ్‌నాయర్, శార్ధూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్ కూడా ఈ మ్యాచ్‌లో ఆడనున్నారు. అలాగే దక్షిణాఫ్రికా ప్రధాన జట్టులోని క్రీడాకారులంతా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నారు.
పక్కా ఏర్పాట్లు చేశాం
మూడు రోజులు పాటు నిర్వహించనున్న ప్రాక్టీస్ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు నార్త్‌జోన్ క్రికెట్ అకాడమీ కార్యదర్శి జీవీ సన్యాసిరాజు తెలిపారు. తొలిసారిగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్వహించే మ్యాచ్ కోసం పక్కా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు రోజుకు 1,500 మంది నుంచి 2,000 మంది వరకు ప్రేక్షకులు వస్తారన్న అంచనాతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మ్యాచ్‌ను చూసేందుకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన లేదన్నారు. గతంలో ఇదే స్టేడియంలో ఇండియా, శ్రీలంక మహిళా జట్ల మధ్య అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ నిర్వహించినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నార్త్‌జోన్ క్రికెట్ అకాడమీ హెడ్ కోచ్ సీడీ థామ్సన్, జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు సీతారామరాజు, అకాడమీ నిర్వాహకుడు సి. జగదీష్‌నాయుడు పాల్గొన్నారు. కాగా, అక్టోబర్ 2 నుంచి వైజాగ్‌లో భారత్-దక్షిణాఫ్రికా మొదటి టెస్ట్ జరగనుంది.
మ్యాచ్‌కు పటిష్ట బందోబస్తు
విజయనగరం జిల్లా డెంకాడ మండలం చింతలవలస గ్రామంలోని డాక్టర్ పీవీజీ రాజు ఏసీఎ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానంలో భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పర్యవేక్షించారు. బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు రోజుల పాటు ప్రాక్టీస్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఎస్పీ స్టేడియాన్ని సందర్శించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని విజయనగరం డీఎస్పీ పి.వీరాంజనేయరెడ్డిని ఆదేశించారు. స్టేడియంలోకి ఆటగాళ్లు ప్రవేశించే మార్గాన్ని, బస చేసే గదులను, వీక్షించేందుకు వచ్చే అభిమానుల గ్యాలరీలను సందర్శించి, ఎక్కడెక్కడ ఏర్పాట్లు చేయాలో అధికారులకు పలు సూచనలు చేశారు. భద్రత, ఏర్పాట్ల విషయమై ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్, నార్త్ జోన్ క్రికెట్ అకాడమీ ప్రతినిధులతో ఎస్పీ చర్చించారు. ఈ మ్యాచ్‌కు భారత్, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొననున్న దృష్ట్యా, ఆటగాళ్ల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఆమె వెంట ఓఎస్‌డీ జె.రామ్మోహనరావు, వన్ టౌన్ సీఐ ఎర్రంనాయుడు, రూరల్ సీఐ రమేష్, స్పెషల్ బ్రాంచ్ సీఐ దుర్గాప్రసాదరావు, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్, అకాడమీ ప్రతినిధులు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment